యస్‌ బ్యాంక్‌ జోష్‌- గోద్రెజ్‌ ప్రాపర్టీస్!

యస్‌ బ్యాంక్‌ జోష్‌- గోద్రెజ్‌ ప్రాపర్టీస్!

సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్‌ జున్‌జున్‌వాలా ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడికావడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్ బ్యాంక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా మరోపక్క.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ రియల్టీ రంగ కంపెనీ గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి యస్‌ బ్యాంక్‌ షేరు లాభాలతో కళకళలాడుతుంటే.. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేరు నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం...

యస్ బ్యాంక్‌ లిమిటెడ్‌
బీఎస్‌ఈలో బల్క్‌ డీల్‌ ద్వారా సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్ జున్‌జున్‌వాలా 12.9 మిలియన్‌ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 69 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 72 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బ్యాంకు ఈక్విటీలో 0.51 శాతం వాటాను షేరుకి రూ. 67 ధరలో రాకేష్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు రూ. 86 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. 

Image result for godrej properties ltd

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌
రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి సంస్థ గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో రూ. 31 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 50 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం మాత్రం 34 శాతం క్షీణించి రూ. 260 కోట్లకు చేరింది. రూ. 25 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 12 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. ఇబిటా మార్జిన్లు 9.5 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం రూ. 94 కోట్ల నుంచి రూ. 135 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం క్షీణించి రూ. 956 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 948 వద్ద కనిష్టాన్ని తాకింది.