జియోకు మొట్టమొదటి గట్టి దెబ్బ..!

జియోకు మొట్టమొదటి గట్టి దెబ్బ..!

ఇన్‌కమింగ్ కాల్ రింగ్ విషయంలో టెలికాం ఆపరేటర్స్ మధ్య నెలకొన్న వివాదాన్ని టెలికాం రెగ్యులేటరీ సంస్థ(TRAI) తెరదించింది. మొబైల్ నుండి కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా 30 సెకండ్ల పాటు రింగ్ మోగాల్సిందేనని స్పష్టం చేసింది. అదేవిధంగా ల్యాండ్ లైన్ అయితే 60 సెకన్లు మోగాలని.. అన్ని టెలికాం కంపెనీలకు స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబర్ 1న ఆదేశాలు జారీ చేస్తూ ట్రాయ్ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
అయితే ఇటీవల జియో, ఎయిర్‌టెల్, ఐడియా వంటి కంపెనీలు  రింగ్‌ టైమ్‌ను పట్టించుకోక పోయినా..మొదట జియో రింగ్ సమయాన్ని 15-20 సెకన్లకు తగ్గించగా.. మిగతా రెండు సంస్థల కూడా అదే బాట పట్టి వాటి కాల్ రింగ్‌ను కుదించాయి. దీనితో మిస్డ్ కాల్స్ సంఖ్య పెరిగింది… వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ట్రాయ్ రంగంలోకి దిగి రింగ్ టైం 30 సెకన్లకు ఫిక్స్ చేయడంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించినట్లైంది.

Image result for Trai Jio
జియోకు గట్టి దెబ్బే..!
ట్రాయి పేర్కొన్నట్టు ఈ రింగ్ టైమింగ్‌లో చిన్న మతలబు ఉంది. ఒక నెట్‌వర్క్ నుండి మరో టెలికాం ఆపరేటర్ నెట్‌వర్క్ కలిగిన ఫోన్‌కు  కాల్‌ చేసినప్పుడు తక్కువ రింగ్‌ టైం ఉంటే అది మిస్డ్‌ కాల్‌గా పడుతుంది. వినియోగదారుడు  కేవలం 15-20 సెకన్ల వ్యవధిలో కాల్ అటెండ్ చేయలేకపోవచ్చు. దీంతో మిస్డ్ కాల్ చూసి తిరిగి ఆ నెంబర్ కు కాల్ చేసే అవకాశాలు ఎక్కువ. దీన్నే జియో సమర్ధవంతంగా వాడుకుంది. ఉదాహరణకు జియో నుండి ఎయిర్ టెల్ కు కాల్ వెళ్ళింది. వినియోగదారుడు కాల్ లిఫ్ట్‌ చేస్తే.. జియో ఎయిర్ టెల్‌కు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను (IUC) చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు కాల్ రింగ్ 15 నుండి 20 సెకండ్లే ఉంటే.. అది మిస్డ్ కాల్‌ గా అయినప్పుడు ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదు. ఇక వినియోగ దారుడు ఆ మిస్‌డ్ కాల్ చూసి తిరిగి ఎయిర్ టెల్ ఫోన్ నుండి జియోకి కాల్ చేస్తాడు. దీంతో జియోకు IUC ఛార్జీల కింద ఎయిర్ టెల్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్లే రిలయన్స్ జియో గతంలోనే రింగ్ టైమ్‌ను 20 సెకన్ల లోపుకు కుదించింది. ఈ వ్యవహారం ఇకపై కుదరబోదని ట్రాయ్‌ తేల్చి చెప్పడంతో జియో ఖంగు తిన్నట్టైంది. ప్రస్తుతం ఉన్న IUC ఛార్జీల టారిఫ్‌లో ఎయిర్ టెల్ వోడాఫోన్ ఐడియాల కంటే జియోనే ఎక్కువగా లాభపడుతూ వస్తుంది. ఇలా ఫోన్ రింగ్‌ను 15 లేదా 20 సెకండ్లకు కుదించడంతో ఇతర ఆపరేటర్ల మోబైల్ వినియోగదారులు ఇబ్బంది పడటమే కాకుండా తిరిగి జియో నెంబర్లకు కాల్ చేస్తున్నారని..దీని వల్ల తమ రెవిన్యూ తగ్గిపోతుందని , జియో ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా రింగ్ టైమ్‌ను తగ్గించిందని ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, BSNL,MTNL వంటి ఆపరేటర్లు ట్రాయ్ వద్ద ఫిర్యాదు చేశారు. మినిమమ్ రింగ్ టైమ్‌ను నిర్దేశించాల్సిందిగా వారు కోరారు. దీంతో రంగంలోకి దిగిన టెలికాం రెగ్యులేషన్ ఆథారిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపి రింగ్‌ టైం ఖచ్చితంగా 30 సెకన్ల పాటు మోగాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.