పదేళ్ల తర్వాత వారెన్ బఫెట్‌ థీమ్ వరస్ట్ పర్ఫార్మెన్స్..!  

పదేళ్ల తర్వాత వారెన్ బఫెట్‌ థీమ్ వరస్ట్ పర్ఫార్మెన్స్..!  

ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ బుల్‌, బెర్క్ షైర్ హాత్‌వే ఇన్‌కార్పోరేషన్ అధినేత అయిన వారెన్ బఫెట్ 2019లో తన అంచనాలను చేరుకోలేక పోయారా? అవుననే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. 2009 నుండి ఇప్పటి దాకా మార్కెట్లలో తన అంచనాలను నిజం చేస్తూ వచ్చిన బఫెట్ ఈ సారి బోర్లా పడ్డారనే అంటున్నారు ఎనలిస్టులు. బెర్క్‌షైర్ హాత్ వే కంపెనీ ఈ ఆర్ధిక సంవత్సరంలో పూర్తిగా అండర్ పెర్ఫార్మ్ చేసిందనే చెప్పుకోవాలి. వార్షిక వృద్ధి మందగించడంతో వారెన్ బఫెట్ స్పెక్యులేషన్స్‌ ఫెయిల్ అయ్యాయని అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా బెర్క్‌షైర్ కంపెనీలో అతి పెద్ద వాటా దారుడైన డేవిడ్ రోల్ఫ్ తన వాటాను ఉపసంహరించుకున్న విషయాన్ని ఉదహరిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఇంకా వేచి చూసే ధోరణిలో ఉండలేనంటూ రోల్ఫ్  తన పెట్టుబడుల ఉపసంహరణ సందర్భంగా వాఖ్యానించడం గమనార్హం. శనివారం నాడు బెర్క్‌షైర్ హాత్‌వే మూడవ త్రైమాసిక ఫలితాలు వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లకు బఫెట్ ఎంచెబుతారా అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ అక్టోబర్ చివరి నాటికి బెర్క్ షైర్ స్టాక్ 4.2శాతం పెరిగింది. కానీ అదే సమయంలో S&P500 ఇండెక్స్‌లో 21శాతం వృద్ధి కనిపించింది. దీనితో పోలిస్తే.. బెర్క్ షైర్ స్టాక్స్ పెరిగిన రేషియో చాలా తక్కుగా నమోదైనట్టు తెలుస్తుంది. బఫెట్ ఎప్పుడూ చెప్పే " స్కై- హై " వాల్యూయేషన్స్ ఈ సారి బెర్క్‌షైర్‌లో కనబడకపోవడం, మేజర్ ఆక్వాజిషన్స్ ఏమీ ప్రకటించక పోవడంతో ఈ కంపెనీ పనితీరు మందగించిందన్న అభిప్రాయం కలుగుతోంది. హాత్‌వే కంపెనీ అధినేత , చీఫ్ ఎక్జిగ్యూటివ్ ఆఫీసర్ అయిన వారెన్ బఫెట్ నిధుల సముపార్జనకు, మూల ధనం పెంచడం కోసం గత జూన్ చివరి నాటికి  2.1 బిలియన్ డాలర్ల స్టాక్స్ ను పునర్‌కొనుగోళ్ళు జరిపారు. ఇక మూడో త్రైమాసికం నాటికి నెట్ బేసిస్‌ ప్రాతిపదికన దాదాపు 6 బిలియన్ డాలర్ల  పునర్ కొనుగోళ్ళను జరిపారు. అంతే కాకుండా ఈ ఆర్ధిక సంవత్సరం తొలి భాగంలో బఫెట్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆక్సిడెంటల్ పెట్రోలియమ్ కార్ప్‌లో పెడతానని ప్రకటించారు. కానీ..ఈ ప్రతిపాదనపై తరువాత నోరు మెదపక పోవడం అనుమానాలకు తావిచ్చినట్టైంది. లిక్విడిటీ సమస్యలు తీవ్రం కావడం వల్లే బఫెట్ ఈ ఒప్పంద ప్రతిపాదనను మూలన పడేశారని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 
అలాగే ప్యాకేజ్ ఫుడ్ దిగ్గజం అయిన క్రాఫ్ట్ హీంజ్  కంపెనీ విషయంలో కూడా బెర్క్ షైర్ బెట్స్ తడబడ్డాయి. క్రాఫ్ట్ మరియు హింజ్ కంపెనీల విలీన సమయంలో 3G క్యాపిటల్‌తో జత కట్టిన బఫెట్ క్రాఫ్ట్ కోసం ఎక్కువ చెల్లింపులు జరిపినట్టు అంగీకరించారు. ఇప్పుడా కంపెనీని వివాదాలు చుట్టుముట్టడంతో వారెన్ బఫెట్ అంచనాలు విఫలమయ్యాయని తెలుస్తుంది. గత గురువారం నాడు  క్రాఫ్ట్ హీంజ్ షేర్లు కాస్త పెరిగినప్పటికీ..గత సంవత్సరం కాలం పాటు జరిపిన అమ్మకాలను పరిశీలిస్తే.. ఈ స్టాక్స్ క్షీణతకు గురయ్యాయనే చెప్పాలి. గురవారం నాటి లాభాలు ఈ యేడాది క్రాఫ్ట్ హీంజ్ యొక్క నష్టాన్ని 25శాతానికి తగ్గించగలిగింది. ఇందులో పెట్టుబడి పెట్టిన బెర్క్‌ షైర్ వాటా విలువపై మాత్రం ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. మరోవైపు గత రెండేళ్లుగా బెర్క్‌షైర్ హాత్‌వే తన స్టాక్స్‌ను పునర్‌కొనుగోళ్ళు విపరీతంగా చేయడం కూడా కంపెనీకి కలిసి రాలేదు. దాదాపు 900 మిలియన్ డాలర్ల స్టాక్స్ ను బఫెట్ రీపర్చేజ్ చేశారు.