ఆరు టాటా సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు ! 

ఆరు టాటా సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు ! 

భారత దేశంలో దిగ్గజ వ్యాపార సంస్థ , కొన్ని దశాబ్దాలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న సంస్థ అయిన టాటా గ్రూప్‌కు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌ మెంట్ అక్టోబర్ 31న షాక్‌ ఇచ్చింది. అక్టోబర్ 31 నాటి ముంబై ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వు ద్వారా ఆరు టాటా ట్రస్టుల నమోదును ఆదాయపు పన్ను శాఖ రద్దు చేసింది. రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన ఆరు ట్రస్టుల్లో జమ్‌షెడ్జీ టాటా ట్రస్ట్, ఆర్డీ టాటా ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, సర్వజనీక్ సేవా ట్రస్ట్ మరియు నవాజ్‌భాయ్ రతన్ టాటా ట్రస్ట్‌లు ఉన్నాయి. 
ఈ ఆరు ట్రస్టులలో రెండు నిషేధిత పెట్టుబడి పద్ధతుల్లో 3000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు 2013 లో కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)  ఎత్తి చూపింది. ఈ ట్రస్టులకు ఇచ్చిన మినహాయింపుల వల్ల రూ.1000 కోట్ల  నష్టానికి దారితీశాయని కాగ్ పేర్కొంది. కాగా ఈ ఆరోపణల నుండి తప్పించుకోడానికి గానూ 2015 లో, టాటా ట్రస్ట్స్ తన ఆరు ట్రస్టుల రిజిస్ట్రేషన్లను ఐటి చట్టంలోని 12AA సెక్షన్ల కింద అప్పగించడానికి సిద్ధపడింది.
టాటా ట్రస్ట్‌లు తమ రిజిస్ట్రేషన్లను అప్పగించాలని  నిర్ణయం తీసుకున్న తరువాత, ఈ ఏడాది జూలైలో ఆదాయపు పన్ను శాఖ వారి రిజిస్ట్రేషన్ల ఉపసంహరణకు సంబంధించి అంచనాను తిరిగి తెరవాలని కోరుతూ ట్రస్టులకు నోటీసులు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ల రద్దు విషయంలో కాస్త ఆలస్యంగా  టాటా ట్రస్ట్స్ ఈ సమస్యకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది.
"రద్దు చేసిన ఈ ఉత్తర్వు 2015 లో ఈ ఆరు ట్రస్టులు లొంగిపోవడానికి, వారి స్వంత ఇష్టానుసారం, ఆదాయపు పన్ను చట్టం క్రింద వారి రిజిస్ట్రేషన్ మరియు సంబంధిత ఆదాయపు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయకూడదని తీసుకున్న నిర్ణయానికి పరాకాష్ట అని ట్రస్ట్‌లు స్పష్టం చేయాలనుకుంటున్నాయి. రిజిస్ట్రేషన్‌ను అప్పగించే నిర్ణయం (చట్టంలో లభించే ఒక ఎంపిక) ట్రస్ట్ యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం తీసుకోబడిందని టాటా ట్రస్టులు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. 2015 నుండే మా ట్రస్టులు మూసివేసినట్టుగా పరిగణించాలన్నది వాటి వాదనగా ఉంది. కానీ దీనికి ఇన్‌కం ట్యాక్స్ వర్గాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి.  
ఆదాయపు పన్ను శాఖ యొక్క ఉత్తర్వులు ట్రస్టుల రిజిస్ట్రేషన్‌ను తక్షణమే రద్దు చేసినప్పటికీ, చట్టపరమైన విషయంగా మరియు గతంలో డిపార్ట్మెంట్ యొక్క స్వంత నిర్ణయానికి అనుగుణంగా, రద్దు 2015 నుండి అమలులోకి రావాలని, రిజిస్ట్రేషన్లను ఉపసహంరించుకున్నప్పుడు  రద్దు చేయడానికి అంగీకరించాయనే అర్ధం వస్తుందని టాటా గ్రూప్ అంటోంది. 
మీడియాలోని కొన్ని విభాగాలలో  ఊహించినట్లుగా, రద్దు ఉత్తర్వులకు అనుగుణంగా ఆదాయపు పన్ను శాఖ నుండి తమకు ఎటువంటి డిమాండ్ నోటీసు రాలేదని టాటా ట్రస్ట్‌లు స్పష్టం చేశాయి. దీనికి మాత్రం ఇన్‌కం ట్యాక్స్ వర్గాలు విభేధిస్తున్నాయి. తాము డిమాండ్ నోటీసును పంపామని 2015 నుండి టాటా గ్రూప్ ట్రస్టులు ఖచ్చితంగా వేల కోట్ల పన్నును చెల్లించాల్సిందేనని ఆదాయపు పన్ను వర్గాలు అంటున్నాయి.