యెస్ బ్యాంక్ స్టాక్స్ పరిస్థితేంటి..?

యెస్ బ్యాంక్ స్టాక్స్ పరిస్థితేంటి..?

దేశయ స్టాక్ మార్కెట్లలో ఇప్పుడు ప్రధాన చర్చ యెస్ బ్యాంక్ స్టాక్స్ మీదే. ఈ స్టాక్స్‌ను కొనచ్చా..? లేక వదిలించుకోవాలా అన్న తర్జన భర్జనలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎండుతున్న పంటపై వర్షపు చినుకులా యెస్ బ్యాంక్‌లో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడుల బైండింగ్ ఆఫర్ వస్తుందన్న వార్త ఇన్వెస్టర్లలో సరికొత్త ఆశలను చిగురింపజేశాయి. దశాబ్ద కాలపు కనిష్టానికి పడిపోయిన ఈ స్టాక్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి.యెస్ బ్యాంక్‌లో ఈక్విటీ స్టాక్స్ కొనుగోలుకు ఒక గ్లోబల్ ఇన్వెస్టర్ ఆఫర్ ఇచ్చారని సంస్థ ప్రకటించడంతో ఈ స్టాక్స్ వేగంగా రికవరీలోకి వచ్చాయి. 
అక్టోబర్ 1 వ తేదీన యెస్ బ్యాంక్ షేర్లు BSE ఇంట్రాడేలో రూ. 29.05 వద్ద అత్యంత కనిష్టంగా ట్రేడ్ అయ్యాయి. ఇది ఆల్ టైమ్ కనిష్టం కావడం విశేషం.  అక్కడి నుండి 96 శాతం జంప్‌ అయి గత బుధవారం నాటికి రూ. 56.80 వద్ద ట్రేడ్ అయింది. ఈ స్టాక్స్ కౌంటర్లలో అమ్మకాల జోరు ఇకపై తగ్గొచ్చని షేర్ ఖాన్ బ్రోకింగ్ కంపెనీ అంచనా వేస్తోంది. యెస్ బ్యాంక్ సక్రమమైన పనితీరును కనబరుస్తూ వస్తే కనుక ఫ్రెష్ ఈక్విటీ పెట్టుబడులు మరిన్ని రావొచ్చని సుస్థిర వ్యాపార విధానాలు, బ్యాడ్ లోన్స్ రికవరీ వంటివి  బ్యాంక్ కు పునర్‌వైభవం తీసుకురావొచ్చని పలు బ్రోకింగ్ కంపెనీలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  కంపెనీ మధ్యంతర వృద్ధికి బోర్డు కూడా తన పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 


కాగా గత మార్చ్ త్రైమాసిక ఫలితాల్లో యెస్ బ్యాంక్‌ తీవ్ర నష్టాలనే ప్రకటించింది. రికవరీ కానీ రుణాలు, నిరర్ధక ఆస్తులు పెరిగి పోవడం వంటి కారణాలను బ్యాంక్ చూపింది. అయితే.. 2008-2018  ఆర్ధిక సంవత్సరాల కాలంలో బ్యాంక్ 35శాతం వృద్ధి ని చూపినా... బోర్డు ఆఫ్ డైరెక్టర్ల వివాదం, కంపెనీ ఛైర్మన్ రాణా కపూర్ ఉద్వాసన వంటివి యెస్ బ్యాంక్ ప్రతిష్టను దిగజార్చాయి. ఇక జూన్ క్వార్టర్‌లో బ్యాంక్ లాభాల్లో దాదాపు 91శాతం క్షీణతను నమోదు చేసింది. గత సంవత్సరం యెస్ బ్యాంక్‌లో 7.56 లక్షల అదనపు రిటైల్ బయ్యర్స్ రావడంతో ప్రధాన పెట్టుబడి దారులు కంపెనీ నుండి బయటకు రావడాన్ని సిద్ధ పడ్డారు. ప్రస్తుతం బ్యాంక్‌లో 1.2 బిలియన్ షేర్ల పెట్టుబడులు రానుండటంతో కంపెనీ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని యెస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవనీత్ గిల్ అంటున్నారు. ప్రస్తుతం యెస్ బ్యాంక్ స్టాక్స్ మీద రాయిటర్స్ ఐకాన్ డేటా ప్రకారం  3 "స్ట్రాంగ్ బై", 3 "బై", 13 "హోల్డ్", 9 "సెల్" , 9 "స్ట్రాంగ్ సెల్"  రేటింగ్స్ ఉన్నాయి.