యస్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌- భళా

యస్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌- భళా

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బ్యాంకులో భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు వెలువడిన వార్తలు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ను పెంచాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు తొలుత 39 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 79 సమీపంలో ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. వెరసి 14 ఏళ్ల తదుపరి ఒకే రోజులో యస్‌ బ్యాంక్‌ షేరు అత్యధిక స్థాయిలో లాభపడింది. కాగా.. ప్రస్తుతం 26 శాతం జంప్‌చేసి రూ. 72 వద్ద ట్రేడవుతోంది. కొత్తగా షేర్ల జారీ ద్వారా గ్లోబల్‌ ఇన్వెస్టర్ నుంచి 120 కోట్ల డాలర్లను(సుమారు రూ. 8500 కోట్లు) సమీకరించనున్నట్లు యస్‌ బ్యాంకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇందుకు గ్లోబల్‌ ఇన్వెస్టర్ నుంచి బైండింగ్‌ ఆఫర్‌ను అందుకున్నట్లు తెలియజేసింది.

ఎస్‌బీఐ స్పీడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 8.3 శాతం జంప్‌చేసి రూ. 314 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 316 వరకూ ఎగసింది. వెరసి గత ఐదు రోజుల్లో 19 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఎస్‌బీఐ రూ. 3012 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 945 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) సైతం 18 శాతం పెరిగి రూ. 24600 కోట్లను తాకింది. ఈ కాలంలో పన్ను వ్యయాలు రూ. 868 కోట్ల నుంచి రూ. 2048 కోట్లకు పెరిగాయి.  

ఎస్‌బీఐ లైఫ్‌ వాటా..
ఎస్‌బీఐ లైఫ్‌లో పాక్షిక వాటా విక్రయం ద్వారా రూ. 3484 కోట్లమేర అనూహ్య(వన్‌టైమ్‌) లాభాన్ని పొందినట్లు స్టేట్‌ బ్యాంక్‌ తెలియజేసింది. క్యూ2లో 9.6 శాతం రుణ వృద్ధిని సాధించగా.. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 7.53 శాతం నుంచి 7.19 శాతానికి బలహీనపడ్డాయి. ఇక నికర ఎన్‌పీఏలు సైతం 3.07 శాతం నుంచి 2.79 శాతానికి వెనకడుగు వేశాయి. ప్రొవిజన్లు రూ. 9183 కోట్ల నుంచి రూ. 13139 కోట్లకు ఎగశాయి. స్థూల స్లిప్పేజెస్‌ మాత్రం రూ. 16212 కోట్ల నుంచి రూ. 8805 కోట్లకు తగ్గాయి. రికవరీ, అప్‌గ్రెడేషన్‌ పద్దు రూ. 3931 కోట్లకు చేరగా .. గతంలో రూ. 5769 కోట్లు నమోదైంది.