దివాలీ వారం- మార్కెట్‌ బిజీబిజీ

దివాలీ వారం- మార్కెట్‌ బిజీబిజీ

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఏడాది(సంవత్‌) 2076 దీపావళి(లక్ష్మీ పూజ) నుంచీ ప్రారంభంకానుంది. దీంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీలు విక్రమ్‌ సంవత్‌ తొలి రోజు(27న) యథాప్రకారం ప్రత్యేక ముహూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. ఆదివారం సాయంత్రం గంటపాటు ట్రేడింగ్‌ను చేపట్టనున్నాయి. ప్రీట్రేడింగ్‌ సెషన్‌తో కలిపి 6.00కు మొదలై 7.15కు ముగియనుంది. అయితే సోమవారం(28న) బలిప్రతిపాద కారణంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు. దీంతో తిరిగి మంగళవారం(29న) నుంచీ సాధారణ ట్రేడింగ్ ప్రారంభంకానుంది. గత దీపావళి నుంచి ఈ దీపావళి వరకూ సంవత్‌ 2075లో సెన్సెక్స్‌, నిఫ్టీ సగటున 10 శాతం చొప్పున లాభపడటం విశేషం! అయితే మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 4 శాతం, స్మాల్‌ క్యాప్‌ 10 శాతం చొప్పున పతనమయ్యాయి. కాగా.. ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..

Image result for Federal reserve

ఫెడ్‌ పాలసీపై కన్ను
ఈ నెల 29న ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లకు కీలకమైన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌.. పరపతి సమీక్షను చేపట్టనుంది. రెండు రోజుల సమావేశం అనంతరం 30న పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు వడ్డీ రేట్లలో కనీసం పావు శాతం కోతను అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గత రెండు సమావేశాల్లో వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది. అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక మందగమన సంకేతాలు కనిపిస్తున్న విషయం విదితమే. దీంతో మరోసారి రేట్ల కోతపై అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(బీవోజే) సైతం ఈ నెల 31న పాలసీ సమీక్షను చేపట్టనుంది. 

క్యూ2 ఫలితాలు
ఇప్పటికే పలు దిగ్గజాలు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌) ఫలితాలు ప్రకటించగా.. ఈ వారం మరికొన్ని బ్లూచిప్స్‌ పనితీరు వెల్లడికానుంది. జాబితాలో.. ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌(26న), మొబైల్‌ సేవల బ్లూచిప్‌ భారతీ ఎయిర్‌టెల్‌(29న), పీఎస్‌యూ దిగ్గం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(31న) ఉన్నాయి. వీటితోపాటు అక్టోబర్‌ నెలకు వాహన విక్రయ గణాంకాలను ఆటో రంగ కంపెనీలు నవంబర్‌ 1 నుంచీ వెల్లడించనున్నాయి. దీంతో ఆటో కౌంటర్లు యాక్టివ్‌గా కదిలే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 
 
ఎఫ్‌అండ్‌వో ముగింపు
అక్టోబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు గురువారం(31న) ముగియనుంది. దీంతో నవంబర్‌ సిరీస్‌కు ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్‌ చేసుకునే అవకాశముంది. సెప్టెంబర్‌ నెలకు మౌలిక రంగ వృద్ధి గణాంకాలు ఇదే రోజు వెలువడనున్నాయి. ఇవికాకుండా అమెరికా, చైనా మధ్య చర్చలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం, ఎఫ్‌పీఐల పెట్టుబడుల తీరు తదితర పలు అంశాలు స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.