వీక్‌ మార్కెట్లో ఈ షేర్లు సెప'రేటు'

వీక్‌ మార్కెట్లో ఈ షేర్లు సెప'రేటు'

మూడు రోజులుగా కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో ప్రస్తుతం అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. బ్రెక్సిట్‌ డీల్‌పై అనిశ్చితి, యూకే పార్లమెంట్‌ ఎన్నికల అంచనాలు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద చర్చలు తదితరాల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఈ  కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, సుదర్శన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌, క్యుపిడ్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌: బీమా రంగ ఈ పీఎస్‌యూ దిగ్గజం షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8.5 శాతం దూసుకెళ్లింది. రూ. 269కు చేరింది. ఇంట్రాడేలో రూ. 279 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 57000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 91000  షేర్లు ట్రేడయ్యాయి.

జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌: ప్రయివేట్‌ రంగ ఈ మార్టిగేజ్‌ రుణాల కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసింది. రూ. 173ను తాకింది. ఇంట్రాడేలో రూ. 181 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 28,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 74000 షేర్లు ట్రేడయ్యాయి.

న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌: సాధారణ బీమా రంగ ఈ పీఎస్‌యూ షేరు కొనేవాళ్లేతప్ప అమ్మకందారులు కరువుకావడంతో 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లింది రూ. 142 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 94000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 56000 షేర్లు ట్రేడయ్యాయి. 

సుదర్శన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌: స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7.7 శాతం జంప్‌ చేసింది. రూ. 406కు చేరింది. ఇంట్రాడేలో రూ. 416ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 14000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 49000 షేర్లు ట్రేడయ్యాయి.

క్యుపిడ్‌ లిమిటెడ్‌: విభిన్న కండోమ్‌ల తయారీ, ఎగుమతుల ఈ దేశీ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 174కు చేరింది. ఇంట్రాడేలో రూ. 184వరకూ పురోగమించింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 11,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 20,000 షేర్లు ట్రేడయ్యాయి.