నేలచూపుల ఓపెనింగ్‌ నేడు?!

నేలచూపుల ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 33 పాయింట్లు క్షీణించి 11,583 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. గురువారం యూఎస్‌ మార్కెట్లు మిశ్రమంగా నిలవగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. కాగా.. గురువారం మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్‌ కావడంతో నేడు కూడా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

అటూఇటుగా
స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు గురువారం చివరికి నీరసంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 38 పాయింట్లు క్షీణించి 39,020కు చేరగా.. నిఫ్టీ సైతం 22 పాయింట్ల వెనకడుగుతో 11,583 వద్ద నిలిచింది.  ఇంట్రాడేలో నిఫ్టీ 11680-11534 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,518 పాయింట్ల వద్ద, తదుపరి 11,454 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,663 పాయింట్ల వద్ద, తదుపరి 11,744 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 28,837, 28,566 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 29,536, 29,964 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అమ్మకాలవైపు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 73 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 739 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.