నిరాశే మిగిల్చిన సంవత్ 2075..!

నిరాశే మిగిల్చిన సంవత్ 2075..!

పెట్టుబడి దారులకు సంవత్ 2075 నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఈక్విటీ ఇన్‌వెస్ట్మెంట్స్ విషయంలో ఇన్వెస్టర్లు పూర్తిగా డీలా పడ్డారు. బులియన్ మార్కెట్లు కాస్త ఆశాజనకంగా కనబడ్డప్పటికీ... జీడీపీ గ్రోత్ అంచనాలను అందుకోలేక...పూర్తి తగ్గుదలతో నమోదు కావడంతో ఆర్ధిక పరిస్థితి ఒడుదిడుకులకు లోనయింది. వ్యవసాయ ఉత్పత్తుల్లో ఒక్క సోయా బీన్స్ ను తప్పించి మిగతా ఉత్పత్తులు పూర్తిగా డౌన్‌ఫాల్‌లో కనబడ్డాయి. ముడి లోహా రంగం కూడా  కొనుగోళ్ళు మందగించడంతో కుంటుపడింది. వీటిలో ఒక్క నికేల్ మాత్రం కాస్త మెరుగ్గా రాణించింది. రియాల్టీ రంగంలో కూడా రెంటల్ సంపద పెరిగినప్పటికీ.. నిర్మాణ పనుల్లో జాప్యాలు, ప్రభుత్వ చర్యలతో కాస్త మందగించిదనే చెప్పాలి. ఇక పట్టణాలు, నగరాల్లో కమర్షియల్ ఆస్తులు మాత్రం డీసెంట్ రిటర్న్స్ ను ఇచ్చాయి. 
సంవత్‌ 2075 లో బ్యాంకులు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనలేక పోయాయి. వడ్డీ రేట్లు తగ్గడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడంతో ఇతర పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. పలు బ్యాంకుల స్కాములు, వందల కోట్ల రుణాలను మాఫీ చేయడం వంటి చర్యలు బ్యాంకులపై విశ్వాసాన్ని సడలించాయి. ఇక కార్పోరేట్ బాండ్లను కొన్న వారికి చేతులు కాల్చుకున్నట్టైంది. మ్యూచువల్ ఫండ్స్ కొంత మెరుగైన ప్రదర్శన చేసినా..మార్కెట్ల ఆటుపోట్లకు అవి గురయ్యాయి. 
అక్టోబర్ 26న ముగిసే సంవత్‌ 2075 లో నిఫ్టీ 50లోని టాప్ టెన్ స్టాక్స్ మాత్రమే 11 నుండి 12 శాతం రిటర్న్స్ ను అందించాయి. ఇక BSE లోని ప్రతి 3 స్టాక్స్‌లో ఒకటి క్షీణతను చవి చూసింది. అయితే.. బీఎస్‌ఈలోని టాప్ 10 పెర్ఫార్మర్ స్టాక్స్ మదుపర్లకు రూ. 9 లక్షల కోట్లను జత చేయగా.. మిగిలిన 2,450 స్టాక్స్ రూ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్‌ను కోల్పోయాయి. స్మాల్ కాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు డెంజర్‌లోనే ఉండిపోయాయి. అయితే.. లార్జ్ క్యాప్‌తో పోలిస్తే.. రానున్న 2076 సంవత్‌లో స్మాల్, మిడ్ క్యాప్‌ రంగాలు రాణించవచ్చని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు.  దీపావళి తరువాత రానున్న సంవత్ 2076లో సెన్సెక్స్ 42,000 పాయింట్లు, నిఫ్టీ 13,000 పాయింట్ల ఎగువన ట్రేడ్ కావొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.