ఈ షేర్ల సొగసు చూడతరమా?

ఈ షేర్ల సొగసు చూడతరమా?

గత కొద్ది రోజులుగా  దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతూ వస్తున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 37000-39000 పాయింట్ల స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూస్తుంటే.. నిఫ్టీ సైతం 10800-11600 స్థాయిలో ఒడిదొడుకులను నమోదు చేసుకుంటోంది. అయితే ఇలాంటి మార్కెట్లోనూ కొన్ని బ్లూచిప్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీల కౌంటర్లు ఇన్వెస్టర్లను నిరవధికంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో కొన్ని షేర్లు చరిత్రాత్మక గరిష్టాలను అందుకుంటే.. మరికొన్ని 52 వారాల గరిష్టాలకు సైతం చేరుతున్నాయి. నిత్య వినియోగ వస్తువులు(ఎఫ్‌ఎంసీజీ), దీర్ఘకాల మన్నిక గల వస్తువులు(వైట్‌ గూడ్స్‌), బీమా రంగ కంపెనీల కౌంటర్లు ప్రధానంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న జాబితాలో అగ్రస్థానం వహిస్తున్నాయి. వివరాలు చూద్దాం.

కొత్త రికార్డులు
నేటి ట్రేడింగ్‌లో హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌), నెస్లే ఇండియా, బాటా ఇండియా, బెర్జర్‌ పెయింట్స్‌, ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా, మణప్పురం ఫైనాన్స్‌, సీమెన్స్‌ ఇండియా, వోల్టాస్‌, వర్ల్‌పూల్‌ ఇండియా కౌంటర్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. ఈ బాటలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సైతం తాజాగా చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి.

రెట్టింపు విలువ
గత ఏడాది కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, మణప్పురం ఫైనాన్స్‌, బాటా ఇండియా షేర్లు ర్యాలీ బాటలో సాగుతూ వచ్చాయి. వెరసి ఈ కంపెనీల మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) 12 నెలల్లో రెట్టింపునకు ఎగసింది. ఇదే విధంగా బెర్జర్‌ పెయింట్స్‌, ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, సీమెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఇన్ఫో ఎడ్జ్, బ్లూస్టార్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌ కౌంటర్లు సైతం 60-100 శాతం మధ్య లాభపడటం విశేషం! ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 15 శాతమే పుంజుకుంది. ఇక దివీస్‌ లేబ్‌, బ్లూస్టార్‌, లాల్‌ పాథ్‌ లేబ్స్‌, ఫైన్ ఆర్గానిక్‌, జీఎస్‌కే కన్జూమర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తదితర పలు దిగ్గజాలు సైతం ఇన్వెస్టర్లకు భారీ లాభాలు పంచడం ప్రస్తావించదగ్గ అంశం!