కార్పొరేట్‌ ఫలితాలపైనే కన్ను

కార్పొరేట్‌ ఫలితాలపైనే కన్ను

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు ప్రధానంగా కార్పొరేట్‌ ఫలితాలే దిక్సూచిగా నిలవనున్నాయి. ఇప్పటికే టీసీఎస్‌, ఇన్ఫోసిస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తదితర పలు దిగ్గజాలు ఈ ఏడాది(2019-20) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేశాయి. ఈ బాటలో మరికొన్ని దిగ్గజ కంపెనీలు ఈ వారం క్యూ2(జులై-సెప్టెంబర్‌) పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హిందుస్తాన్‌ జింక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌ 21న, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 22న ఫలితాలు ప్రకటించనున్నాయి.

ఇతర బ్లూచిప్స్‌
ద్విచక్ర వాహన దిగ్గజాలు బజాజ్‌ ఆటో, హీరో మోటోతోపాటు ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 23న, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ, కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ 24న క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇక పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ 25న ఫలితాలు విడుదల చేయనుంది. వెరసి ఈ వారం క్యూ2 ఫలితాలే ప్రధానంగా మార్కెట్లపై ప్రభావాన్ని చూపే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. నేడు(19న) ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ2 ఫలితాలు ప్రకటించనుంది. దీంతో షేరుపై ఈ ప్రభావం మంగళవారం కనిపించనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. వారాంతాన డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఆర్‌ఐఎల్‌ ఆసక్తికర ఫలితాలు విడుదల చేసింది. ఈ అంచనాలతో శుక్రవారమే ఆర్‌ఐఎల్‌ షేరు లాభపడటం ద్వారా తొలిసారి దేశీ స్టాక్‌ మార్కెట్లలో రూ. 9 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌)ను సాధించిన కంపెనీగా నిలిచింది కూడా!

4 రోజులే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో సోమవారం(21న) స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే(22-25) పరిమితంకానుంది. కాగా.. ఈ నెల 24న యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్షను చేపట్టనుంది. దీనిలో భాగంగా వడ్డీ రేట్లపై నిర్ణయాలను ప్రకటించనుంది.

ఇతర అంశాలు..
విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు, బ్రెక్సిట్‌ డీల్‌, అమెరికా.. చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలు తదితర పలు అంశాలు సైతం స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని నిపుణులు పేర్కొంటున్నారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ, స్వదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు వంటి అంశాలను సైతం ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని తెలియజేశారు.