ఆరో రోజూ మార్కెట్లు.. భళా

ఆరో రోజూ మార్కెట్లు.. భళా

యథాప్రకారం ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 246 పాయింట్లు పెరిగి 39,298కు చేరగా.. నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 11,662 వద్ద స్థిరపడింది. వెరసి ఆరో రోజూ లాభాలతో నిలిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39361-38964 పాయింట్ల మధ్య ఊగిసలాడగా... నిఫ్టీ 11685-11553 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. కాగా.. ఆమోదయోగ్య బ్రెక్సిట్‌కు వీలుగా బ్రిటన్‌తో యూరోపియన్‌ యూనియన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

మీడియా డౌన్
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా మీడియా 1 శాతం నీరసించింది. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, ఫార్మా 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 8.2 శాతం జంప్‌చేయగా.. కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, మారుతీ, గ్రాసిమ్, నెస్లే, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌, టైటన్‌ 3.3-2 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ 5.5 శాతం పతనంకాగా.. టాటా మోటార్స్‌, సిప్లా, ఐషర్, హిందాల్కో, ఐసీఐసీఐ, బజాజ్‌ ఆటో, ఎయిర్‌టెల్‌, ఐవోసీ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. 

బీహెచ్‌ఈఎల్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో బీహెచ్‌ఈఎల్‌ 22 శాతం, ఐబీ హౌసింగ్‌ 19 శాతం చొప్పున దూసుకెళ్లగా.. జీఎంఆర్‌, సెయిల్‌,  నాల్కో, ఎన్‌ఎండీసీ, ఎన్‌బీసీసీ, మణప్పురం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 9-7 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క డిష్‌ టీవీ 4.5 శాతం పతనంకాగా.. మదర్‌సన్, భారత్‌ ఫోర్జ్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఈక్విటాస్‌, ఎంఆర్‌ఎఫ్‌ 2-1.25 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

చిన్న షేర్లు జూమ్‌
ఆటుపోట్ల మధ్య ప్రారంభమైనప్పటికీ తదుపరి ఊపందుకున్న మార్కెట్ల ప్రభావంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.7 శాతం చొప్పున ఎగశాయి. 1600 షేర్లు లాభపడగా.. 931 మాత్రమే నష్టాలతో ముగిశాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌, డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌ లిమిటెడ్‌ 5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. 

ఎఫ్‌పీఐల జోరు
ఇటీవల దేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం నగదు విభాగంలో రూ. 1158 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 512 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 686 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 1577 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.