ఈ షేర్లకు డిజిన్వెస్ట్‌మెంట్‌ కిక్‌

ఈ షేర్లకు డిజిన్వెస్ట్‌మెంట్‌ కిక్‌

పలు కంపెనీలలో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాలను విక్రయించే యోచనలో ఉన్నట్లు వెలువడుతున్న వార్తలు పీఎస్‌యూ రంగ కౌంటర్లకు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వివిధ రంగాల పీఎస్‌యూ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లు 52 వారాలను గరిష్టాలను తాకగా.. మరికొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరుగుతోంది. జాబితాలో ప్రభుత్వ రంగ కంపెనీలు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌(బీఈఎల్‌), టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఐటీడీసీ) ఏడాది గరిష్టాలకు చేరాయి. ఇతర వివరాలు చూద్దాం.. 

పీఎస్‌యూలుగా కొనసాగింపు
పీఎస్‌యూ కంపెనీలలో కేంద్ర ప్రభుత్వ వాటా విక్రయ అంశాన్ని వచ్చే వారం కార్పొరేట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. పలు కంపెనీలలో ప్రభుత్వ వాటాను 51 శాతం దిగువకు తగ్గించుకోనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇందుకు వీలుగా కొంతమేర వాటాలను విక్రయించేందుకు సీసీఈఏ ఆమోదముద్ర వేయనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. తద్వారా పీఎస్‌యూలుగా వీటిని కొనసాగిస్తూనే వ్యూహాత్మకంగా వాటాలను విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి.

జోరుగా హుషారుగా..
డిజిన్వెస్ట్‌మెంట్‌ వార్తలతో జోరందుకున్న పీఎస్‌యూ కంపెనీల జాబితాలో బీహెచ్‌ఈల్‌, బీఈఎల్‌ హిందుస్తాన్‌ కాపర్‌, ఎంఎంటీసీ, న్యూ ఇండియా ఎస్సూరెన్స్‌ కంపెనీ, ఎంవోఐఎల్‌, ఎన్‌బీసీసీ ఇండియా, ఎన్‌ఎల్‌సీ ఇండియా, జనరల్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌, నేషనల్‌ అల్యూమినియం కంపెనీ(నాల్కో), స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సెయిల్‌), షిప్పింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌సీఐ) తదితరాలున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బీహెచ్‌ఈఎల్‌ 22 శాతం దూసుకెళ్లి రూ. 55కు చేరగా.. బీఈఎల్‌ 3.3 శాతం పెరిగి రూ. 117 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 121 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇక ఐటీడీసీ తొలుత రూ. 368 వద్ద ఏడాది గరిష్టానికి చేరగా.. ప్రస్తుతం రూ. 353 వద్ద ట్రేడవుతోంది.

లాభాలతో
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హింద్‌ కాపర్‌ 17 శాతంపైగా దూసుకెళ్లి రూ. 38 వద్ద, ఎంఎంటీసీ 17 శాతం జంప్‌చేసి రూ. 18.5 వద్ద, న్యూ ఇండియా 6.5 శాతం పెరిగి రూ. 146 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఎంవోఐఎల్‌ 6.2 శాతం లాభంతో రూ. 142 వద్ద, ఎన్‌బీసీసీ 8.3 శాతం పుంజుకుని రూ. 37 వద్ద, జనరల్‌ ఇన్సూరెన్స్‌ 6 శాతం ఎగసి రూ. 280 వద్ద, ఎన్‌ఎల్‌సీ 3 శాతం బలపడి రూ. 55 వద్ద, నాల్కో 7.6 శాతం పురోగమించి రూ. 44 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా సెయిల్‌ 6.5 శాతం పెరిగి రూ. 36 వద్ద, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ 8 శాతం జంప్‌చేసి రూ. 46 వద్ద కదులుతున్నాయి.