వారెవ్వా ఆర్‌ఐఎల్‌- న్యూ రికార్డ్‌

వారెవ్వా ఆర్‌ఐఎల్‌- న్యూ రికార్డ్‌

ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌ రీత్యా) దేశీ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డ్ సాధించింది. ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసిక ఫలితాలు నేడు ప్రకటించనున్న నేపథ్యంలో సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ దిగ్గజం ఆర్‌ఐఎల్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగడం దీనికి కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. మరోవైపు ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై-సెప్టెంబర్‌)లో సాధించిన ఫలితాలు అంచనాలను చేరడంతో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఆర్‌ఐఎల్‌ జోరు
ఇంధనం, మొబైల్‌, రిటైల్‌ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నేడు క్యూ2(జులై-సెప్టెంబర్‌) ఫలితాలు ప్రకటించనుంది. కంపెనీ పనితీరుపై ఆశావహ అచనాలతో ఆర్‌ఐఎల్‌ షేరు  ప్రస్తుతం బీఎస్‌ఈలో 2 శాతం పెరిగి రూ. 1424ను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 9.02 లక్షల కోట్లను తాకింది. తద్వారా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఈ ఫీట్‌ సాధించిన తొలి లిస్టెడ్‌ కంపెనీగా ఆవిర్భవించింది. అంతేకాకుండా అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోంది. ఆర్‌ఐఎల్‌ షేరు తొలుత రూ. 1428 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఈ ఏడాది(2019)లో ఇప్పటివరకూ ఆర్‌ఐఎల్‌ 27 శాతం ర్యాలీ చేసింది! ఇక మార్కెట్‌ విలువరీత్యా రెండో ర్యాంకులో టాటా గ్రూప్‌ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్‌ నిలుస్తోంది. ప్రస్తుతం బీఎస్ఈలో టీసీఎస్‌ షేరు 1 శాతం బలపడి రూ. 2048 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 7.68 లక్షల కోట్లకు చేరింది. ఇక రూ. 6.71 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదుపరి స్థానాన్ని పొందింది. ప్రస్తుతం ఈ షేరు 0.6 శాతం పుంజుకుని రూ. 1228 వద్ద కదులుతోంది.

Image result for south indian bank

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం 20 శాతం ఎగసి రూ. 84 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం పుంజుకుని రూ. 2203 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.61 శాతం నుంచి 4.92 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు 3.16 శాతం నుంచి 3.48 శాతానికి చేరాయి. ప్రొవిజన్లు 50 శాతం పెరిగిపోయి రూ. 306 కోట్లను అధిగమించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 10.3 వద్ద ట్రేడవుతోంది.