ఎల్‌అండ్‌టీఐ జోరు- జేబీఎం బేజార్‌

ఎల్‌అండ్‌టీఐ జోరు- జేబీఎం బేజార్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను చేరడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోవైపు ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై-సెప్టెంబర్‌)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆటో విడిభాగాల కంపెనీ జే భారత్ మారుతీ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ లాభాలతో సందడి చేస్తుంటే.. జేబీఎం లిమిటెడ్‌ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో త్రైమాసిక ప్రాతిపదికన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్‌ నికర లాభం 1.2 శాతం వృద్ధితో రూ. 360 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం సైతం 1.7 శాతం పుంజుకుని రూ. 466 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 3.5 శాతం పెరిగి  రూ. 2571 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 18.1 శాతంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 1600 వద్ద ట్రేడవుతోంది. 

Image result for jay bharat maruti ltd

జే భారత్‌ మారుతీ లిమిటెడ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో జే భారత్‌ మారుతీ లిమిటెడ్‌ నికర లాభం 77 శాతం పడిపోయి రూ. 3.76 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం క్షీణించి రూ. 412 కోట్లను తాకింది. ఇక స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం 79 శాతం తిరోగమించి రూ. 3.38 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 25 శాతం వెనకడుగుతో రూ. 411 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జే భారత్‌ మారుతీ షేరు 5 శాతం పతనమై రూ. 186 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 183 వరకూ నీరసించింది.