బ్రెక్సిట్‌ డీల్‌ ఓకే- యూఎస్‌ ప్లస్‌

బ్రెక్సిట్‌ డీల్‌ ఓకే- యూఎస్‌ ప్లస్‌

ఎట్టకేలకు బ్రెక్సిట్‌కు వీలుగా బ్రిటన్‌తో యూరోపియన్‌ యూనియన్ డీల్‌ కుదుర్చుకున్న వార్తలతో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. దీనికితోడు నెట్‌ఫ్లిక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ పటిష్ట ఫలితాలు సాధించడంతో సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించింది. ఈ నేపథ్యంలో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్‌ 24 పాయింట్లు(0.1 శాతం) పుంజుకుని 27,026 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 8 పాయింట్లు(0.3 శాతం) జమచేసుకుని 2,998 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 33 పాయింట్లు(0.43 శాతం) లాభపడి 8,157 వద్ద స్థిరపడింది.   

నెట్‌ఫ్లిక్స్‌ జోరు
మూడో త్రైమాసికంలో పటిష్ట పనితీరు చూపడంతో వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ప్లిక్స్‌ 2.5 శాతం జంప్‌చేసింది. అంతర్జాతీయంగా వినియోగదారుల సంఖ్య పెరగడం ఇందుకు సహకరించింది. ట్రేడింగ్‌, అడ్వయిజరీ ఆదాయాలు పుంజుకోవడంతో బ్యాంకింగ్‌ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ ఫలితాలు అంచనాలను మించాయి. దీంతో ఈ షేరు 1 శాతం బలపడింది. కాగా.. అటు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌, ఇటు ఈయూ కమిషన్‌ ప్రెసిడెంట్‌ జీన్‌ క్లాడ్‌ బ్రెక్సిట్‌కు గొప్ప డీల్‌ కుదిరినట్లు ప్రకటించారు. శనివారం యూకే పార్లమెంట్‌లో డీల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు బోరిస్‌ పేర్కొన్నారు. కాగా.. ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో చైనా జీడీపీ 6 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థికవేత్తలు 6.1 శాతం వృద్ధిని అంచనా వేయడం గమనార్హం!

మిశ్రమం
బ్రెక్సిట్‌పై డీల్‌ కుదిరిన నేపథ్యంలో గురువారం యూరోపియన్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూకే 0.2 శాతం బలపడగా.. ఫ్రాన్స్‌ 0.4 శాతం, జర్మనీ 0.13 శాతం చొప్పున నీరసించాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. జపాన్‌ 0.5 శాతం పుంజుకోగా.. చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌, తైవాన్‌ 0.2 శాతం చొప్పున క్షీణించాయి. మిగిలిన మార్కెట్లలో ఇండొనేసియా, కొరియా నామమాత్ర నష్టాలతో కదులుతున్నాయి. థాయ్‌లాండ్‌ 0.2 శాతం లాభంతో ఉంది. కాగా.. కరెన్సీ మార్కెట్లలో పౌండ్‌ 5 నెలల గరిష్టం 1.29కు ఎగసింది. యూరో 1.127 వద్ద రెండు నెలల గరిష్టాన్ని తాకింది. డాలరు ఇండెక్స్‌ 97.59కు బలహీనపడగా.. జపనీస్‌ యెన్‌ 108.65కు బలపడింది.  10 ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 1.745కు చేరాయి.