ప్రతికూల ఓపెనింగ్‌ నేడు?!

ప్రతికూల ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 37 పాయింట్లు క్షీణించి 11,568 వద్ద ట్రేడవుతోంది.  సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. బ్రెక్సిట్‌కు ఈయూ, బ్రిటన్‌ మధ్య డీల్‌ కుదరడం, నెట్‌ఫ్లిక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ పటిష్ట ఫలితాల నేపథ్యంలో గురువారం యూరప్‌, అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. అయితే వరుసగా ఐదు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ మార్కెట్లు నేడు ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

చివర్లో దూకుడు
గురువారం తొలుత అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ జోరందుకున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగేందుకు(బ్రెక్సిట్‌) దాదాపు డీల్‌ కుదిరిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 450 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. 453 పాయింట్లు జమచేసుకుని 39,052 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 122 పాయింట్లు ఎగసి 11,586 వద్ద స్థిరపడింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార వివాదానికి ఒప్పందం కుదరనున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి ఐదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీతో ముగిశాయి.  

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,484 పాయింట్ల వద్ద, తదుపరి 11,382 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,643 పాయింట్ల వద్ద, తదుపరి 11,701 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 28,635, 28,281 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 29,196, 29,403 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల జోరు
ఇటీవల దేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం నగదు విభాగంలో రూ. 1158 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 512 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 686 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 1577 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.