చివర్లో దూకుడు-39000 దాటేసింది

చివర్లో దూకుడు-39000 దాటేసింది

తొలుత అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ జోరందుకున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగేందుకు(బ్రెక్సిట్‌) దాదాపు డీల్‌ కుదిరిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 450 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. 453 పాయింట్లు జమచేసుకుని 39,052 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 122 పాయింట్లు ఎగసి 11,586 వద్ద స్థిరపడింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార వివాదానికి ఒప్పందం కుదరనున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి ఐదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీతో ముగిశాయి.  

ఐటీ డౌన్
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా ఐటీ మాత్రమే(0.4 శాతం) వెనకడుగు వేసింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో రంగాలు 3 శాతం జంప్‌చేయగా.. మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ 1.7-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్ బ్యాంక్‌ 15 శాతం, టాటా మోటార్స్‌ 13 శాతం చొప్పున దూసుకెళ్లగా.. ఐషర్‌, ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఆటో, స్టేట్‌బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌, బజాజ్‌ ఫిన్‌ 8-2.25 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే హెచ్‌సీఎల్‌ టెక్‌, వేదాంతా, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్, ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, ఓఎన్‌జీసీ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి.

ఐబీ హౌసింగ్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌ 14 శాతం దూసుకెళ్లగా.. టాటా మోటార్స్‌ డీవీఆర్, మదర్‌సన్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, టీవీఎస్‌ మోటార్‌, బీహెచ్‌ఈఎల్‌, పిరమల్‌ 13-6.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐడియా, నాల్కో, ఎక్సైడ్‌, మైండ్‌ట్రీ, శ్రీసిమెంట్‌, కంకార్‌, బయోకాన్‌, ఐజీఎల్‌ 3-1 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు అప్‌
ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన మార్కెట్లు చివర్లో జోరందుకోవడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.8-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1428 లాభపడగా.. 1058 నష్టాలతో ముగిశాయి.

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 686 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1577 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ బాటలో మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 436 కోట్లు, డీఐఐలు రూ. 929 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.