ఎన్‌ఐఐటీ పతనం- పెన్నార్‌ జోష్‌

ఎన్‌ఐఐటీ పతనం- పెన్నార్‌ జోష్‌

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు రికార్డ్‌ డేట్‌ ముగిసిన నేపథ్యంలో ఐటీ ఎడ్యుకేషనల్‌ సేవల కంపెనీ ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క సెప్టెంబర్‌లో వివిధ బిజినెస్‌ విభాగాలు మొత్తం రూ. 304 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు వెల్లడించడంతో హైదరాబాద్‌ కంపెనీ పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌ కౌంటర్‌ కుప్పకూలగా.. పెన్నార్ ఇండస్ట్రీస్‌ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌నకు అక్టోబర్‌ 18 రికార్డ్‌ డేట్‌కావడంతో ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌ కౌంటర్‌ ఎక్స్‌డేట్‌గా ట్రేడవుతోంది. దీంతో ఈ కౌంటర్లో భారీ స్థాయిలో అమ్మకాలు తలెత్తాయి. వెరసి ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 10.2 శాతం కుప్పకూలి రూ. 78 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 74 వరకూ జారింది. ఆగస్ట్ 10న కంపెనీ బోర్డు షేరుకి రూ. 125 ధర మించకుండా 2.68 కోట్ల ఈక్విటీ షేర్ల కొనుగోలుకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు రూ. 335 కోట్లవరకూ వెచ్చించనుంది. కాగా.. గత ఆరు నెలల్లో ఎన్‌ఐఐటీ షేరు 30 శాతం దిగజారింది. ఈ ఏడాది మే నెలలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌లో మొత్తం వాటాను రూ. 2020 కోట్లకు ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌ విక్రయించిన విషయం విదితమే.

Related image

పెన్నార్ ఇండస్ట్రీస్‌
వివిధ విభాగాలు సెప్టెంబర్‌లో మొత్తంగా రూ. 304 కోట్ల విలువైన ఆర్డర్లను సంపాదించినట్లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ తెలియజేసింది. దీంతో ప్రీఇంజినీర్డ్‌ బిల్డింగ్ విభాగం ఆర్డర్ల బుక్‌ రూ. 430 కోట్లకు, రైల్వే వెర్టికల్‌ ఆర్డర్లు రూ. 250 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేరు 5.4 శాతం జంప్‌చేసి రూ. 26.5 వద్ద ట్రేడవుతోంది.