పీఎన్‌బీహెచ్‌ భళా- మాస్టెక్‌ పతనం

పీఎన్‌బీహెచ్‌ భళా- మాస్టెక్‌ పతనం

ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో వివిధ బిజినెస్‌ విభాగాలు వృద్ధి చూపడంతో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోవైపు ప్రస్తుత ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో చూపిన పనితీరు నిరాశ పరచడంతో  సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి సంస్థ మాస్టెక్ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి పీఎన్‌బీ హౌసింగ్‌ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. మాస్టెక్‌ లిమిటెడ్‌ కౌంటర్ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ. 4970 కోట్ల రుణాలను విడుదల చేసినట్లు తెలియజేసింది. వీటిలో రూ. 4718 కోట్లమేర రిటైల్‌ రుణాలను మంజూరు  చేయగా.. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 89,471 కోట్లను తాకాయి. స్థూల మొండిబకాయిలు 0.73 శాతంకాగా.. ఈ కాలంలో ఈసీబీ మార్గంలో 17.5 కోట్ల డాలర్లను సమీకరించింది. ఎన్‌సీడీల ద్వారా మరో రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పీఎన్‌బీ హౌసింగ్‌ షేరు 6.4 శాతం జంప్‌చేసి రూ. 404 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 437 వరకూ ఎగసింది. అయితే  తొలుత రూ. 371 దిగువన 52 వారాల కనిష్టాన్ని తాకడం గమనార్హం! 

Image result for mastek ltd

మాస్టెక్ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో మాస్టెక్ లిమిటెడ్‌ నికర లాభం 2 శాతమే పుంజుకుని రూ. 25 కోట్లకు చేరింది. అయితే నిర్వహణ లాభం 15 శాతం క్షీణించి రూ. 23 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం 1.6 శాతం నీరసించి రూ. 244 కోట్లకు పరిమితమైంది. ఇబిట్‌ మార్జిన్లు 10.9 శాతం నుంచి 9.4 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో మాస్టెక్ లిమిటెడ్‌ షేరు 6 శాతం పతనమై రూ. 299 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 326 వద్ద గరిష్టాన్ని తాకగా.. తొలుత రూ. 296 వద్ద 52 వారాల కనిష్టాన్ని సైతం చవిచూసింది.