ఆటుపోట్లలోనూ ఈ షేర్లు దౌడు

ఆటుపోట్లలోనూ ఈ షేర్లు దౌడు

వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లకు అలుపొచ్చింది. ఈయూతో బ్రెక్సిట్‌ డీల్‌, అమెరికా, చైనా మధ్య ఒప్పందంపై సందేహాలతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు సైతం వెనకడుగు వేయగా.. ట్రేడర్ల అప్రమత్తత కారణంగా దేశీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 71 పాయింట్లు లాభపడి 38,670కు చేరగా.. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,491 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఈ  కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, 3ఎం ఇండియా లిమిటెడ్‌, ఇమామీ లిమిటెడ్‌, గార్డెన్‌ సిల్క్‌ మిల్స్‌ లిమిటెడ్‌, వీనస్‌ రెమిడీస్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌: అదానీ గ్రూప్‌లోని పునరుత్పాదక ఇంధన రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 13.5 శాతం దూసుకెళ్లింది. రూ. 91కు చేరింది. ఇంట్రాడేలో రూ. 93 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 4.29 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 8.55 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

3ఎం ఇండియా లిమిటెడ్‌: ఇంజినీరింగ్‌, ఆటోవిడిభాగాలు తదితర డైవర్సిఫైడ్‌ బిజినెస్‌ల ఈ దిగ్గజ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం జంప్‌చేసింది. రూ. 22,650ను తాకింది. ఇంట్రాడేలో రూ. 22,915 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 250 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 600 షేర్లు ట్రేడయ్యాయి.

ఇమామీ లిమిటెడ్‌: ఈ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లింది రూ. 346కు చేరింది. ఇంట్రాడేలో రూ. 352 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 38,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 80,000 షేర్లు ట్రేడయ్యాయి. 

గార్డెన్‌ సిల్క్‌ మిల్స్‌ లిమిటెడ్‌: టెక్స్‌టైల్స్‌ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 12.5కు చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 3,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.2 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

వీనస్‌ రెమిడీస్‌ లిమిటెడ్‌: ఫార్మా రంగానికి చెందిన ఈ దేశీ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 9 శాతం జంప్‌చేసింది. రూ. 28.35కు చేరింది. ఇంట్రాడేలో రూ. 31 వరకూ పురోగమించింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 10,400 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.18 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.