బజాజ్‌ కన్జూమర్‌- ఎస్‌బీఐ లైఫ్‌.. కేక

బజాజ్‌ కన్జూమర్‌- ఎస్‌బీఐ లైఫ్‌.. కేక

రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ప్రమోటర్లు భారీ స్థాయిలో వాటాను విక్రయించిన నేపథ్యంలో బజాజ్‌ కన్జూమర్‌ షేరు రేటింగ్‌ను విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం మెక్వారీ తాజాగా పునరుద్ఘాటించింది. కాగా.. మరోపక్క జనరల్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్య సంస్థ(జేవీ)లో ఆస్ట్రేలియా కంపెనీ ఐఏజీ వాటాను విక్రయించనున్న వార్తల కారణంగా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ కౌంటర్‌ మరోసారి జోరందుకుది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ వరుసగా రెండో రోజు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. వివరాలు చూద్దాం..

బజాజ్‌ కన్జూమర్ కేర్‌
కంపెనీ ఈక్విటీలో సుమారు 22 శాతం వాటాకు సమానమైన 3.22 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్‌ గ్రూప్‌ బజాజ్‌ రీసోర్సెస్‌ విక్రయించినట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ ఇప్పటికే వెల్లడించింది. షేరుకి రూ. 194.56 సగటు ధరలో వీటిని విక్రయించడం ద్వారా రూ. 628 కోట్లను సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా అమ్మకం చేపట్టిన ఈ వాటాను ఏబీ సన్‌లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ తదితర మ్యూచువల్‌ ఫండ్స్‌ సొంతం చేసుకున్నాయి. కాగా.. ఈ ఏడాది మార్చిలో సైతం ప్రమోటర్లు 6.85 శాతం వాటాకు సమానమైన 1.01 కోట్ల షేర్లను రూ. 320 కోట్లకు విక్రయించారు. ఈ నేపథ్యంలో విదేశీ బ్రోకింగ్‌ సంస్థ మెక్వారీ బజాజ్‌ కన్జూమర్ షేరుకి ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను ప్రకటించింది. రూ. 592 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ కన్జూమర్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 259 వద్ద ట్రేడవుతోంది. తొలుత 17 శాతం దూసుకెళ్లి రూ. 271ను తాకింది. బుధవారం సైతం ఈ షేరు 20 శాతం జంప్‌చేసి రూ. 244 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో గల 26 శాతం వాటాను విక్రయించేందుకు భాగస్వామి ఐఏజీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జేవీలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 70 శాతం, ఐఏజీకి 26 శాతం చొప్పున వాటా ఉంది. కాగా.. ఏఐజీ వాటాలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ 16 శాతం, WP హనీ వీట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 10 శాతం చొప్పున కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్‌బీఐ లైఫ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 918 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 928ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. బుధవారం సైతం ఈ షేరు 4.5 శాతం ఎగసి రూ. 877 వద్ద ముగిసిన విషయం విదితమే. ఇకపై కంపెనీ రెండంకెల వృద్ధిని సాధించగలదన్న అంచనాలతో రీసెర్చ్‌ సంస్థ ఎమ్‌కే రూ. 991 టార్గెట్‌ ధరతో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేరుకి బయ్‌ రేటింగ్‌ను ప్రకటించిన నేపథ్యంలో బుధవారం సైతం ఈ షేరుకి డిమాండ్‌ పెరిగిన విషయం విదితమే.