ఐబీ హౌసింగ్‌ జోరు- దివాన్‌ డీలా

ఐబీ హౌసింగ్‌ జోరు- దివాన్‌ డీలా

రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ తాజాగా కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్స్‌ను AA+గా పునరుద్ఘాటించిన వార్తలతో మార్టిగేజ్‌ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోపక్క సన్‌బ్లింక్‌ రియల్‌ ఎస్టేట్‌కు రుణాలివ్వడంపై ఈడీ దర్యాప్తు చేపట్టిన వార్తలతో ఎన్‌బీఎఫ్‌సీ.. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తుంటే.. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్
గతంలో కంపెనీకి ఇచ్చిన AA+ దీర్ఘకాలిక రేటింగ్‌తోపాటు, A1+ స్వల్పకాలిక రేటింగ్‌ను సైతం క్రిసిల్‌ తాజాగా పునరుద్ఘాటించినట్లు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ పేర్కొంది. అయితే లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌తో విలీనాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ తిరస్కరించిన నేపథ్యంలో నెగిటివ్‌ ఔట్‌లుక్‌ వాచ్‌ను ప్రకటించినట్లు తెలియజేసింది. లిక్విడిటీ విషయంలో కంపెనీ పటిష్టతను రేటింగ్‌ వెల్లడిస్తున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా నష్టాల బాటలో సాగుతున్న ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6.25 శాతం జంప్‌చేసి రూ. 184 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో తొలుత రూ. 166 దిగువన ఐదేళ్ల కనిష్టాన్ని తాకడం గమనార్హం!

Image result for dewan housing finance corporation ltd

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
దుబాయ్‌ గ్యాంగ్‌స్టర్‌ ఇక్బాల్‌ మెమన్‌కు సంబంధాలున్న సన్‌బ్లింక్‌ రియల్‌ ఎస్టేట్‌కు రూ. 2186 కోట్ల రుణాలిచ్చిన అంశంపై ఈడీ దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. సన్‌బ్లింక్‌కు ఇచ్చిన రుణాలు అక్రమ మార్గంలో విదేశాలలోని ఇక్బాల్‌ మెమన్‌ ఖాతాలకు చేరినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం పతనమై రూ. 19.2 వద్ద ట్రేడవుతోంది. ఇది సరికొత్త కనిష్టంకావడం గమనార్హం!