నాల్కో- బంధన్‌ బ్యాంక్‌ వీక్‌

నాల్కో- బంధన్‌ బ్యాంక్‌ వీక్‌

కోకింగ్‌ కోల్‌కు ఏర్పడిన భారీ కొరత కారణంగా స్మెల్టర్‌ ప్లాంట్‌ కార్యకలాపాలు దెబ్బతిన్నట్లు మెటల్‌ రంగ పీఎస్‌యూ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. కాగా.. మరోపక్క ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ప్రయివేట్ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ షేరు విలువ అధికస్థాయికి చేరినట్లు విదేశీ బ్రోకింగ్‌ కంపెనీ మెక్వారీ తాజాగా అభిప్రాయపడింది. వెరసి ఈ రెండు కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

నాల్కో లిమిటెడ్‌
బొగ్గు కొరత కారణంగా స్మెల్టర్‌ కార్యకలాపాలకు విఘాతం కలిగినట్లు పీఎస్‌యూ సంస్థ నాల్కో లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా విద్యుత్‌ వ్యయాలు సైతం పెరిగినట్లు తెలియజేసింది. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి 7,000-8,000 టన్నులమేర బొగ్గు సరఫరాలు తగ్గడంతో రాష్ట్ర గ్రిడ్‌ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయవలసి వచ్చినట్లు వివరించింది. దీంతో విద్యుత్‌ వ్యయాలు అధికమైనట్లు పేర్కొంది. వెరసి కంపెనీ లాభదాయకత క్షీణించనున్న అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నాల్కో లిమిటెడ్‌ షేరు 4.2 శాతం పతనమై రూ. 40 వద్ద ట్రేడవుతోంది. 

Image result for bandhan bank

బంధన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
ఇటీవల ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో భాగమైన ప్రయివేట్‌ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌పై విదేశీ రీసెర్చ్‌ కంపెనీ మెక్వారీ సమీక్షను చేపట్టింది. దీనిలో భాగంగా షేరు ధర ప్రైస్‌టు బుక్‌ వేల్యూ(పీబీవీ)తో పోలిస్తే 5 రెట్లుపైగా పలుకుతున్నట్లు తెలియజేసింది. ఇది రిస్కులను పెంచుతున్నట్లు (మార్జిన్‌ ఆఫ్‌ సేఫ్టీ లేకపోవడం) అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాలలో విడుదల చేస్తున్న రుణ మొత్తాలు పెరగడం కూడా ఆందోళనలు కలిగిస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా షేరుకి అండర్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు తెలియజేసింది. రూ. 425 టార్గెట్‌ ధరను సైతం ప్రకటించింది. ఇది ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే సుమారు 30 శాతం డిస్కౌంట్‌కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంధన్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్ఈలో 2.3 శాతం క్షీణించి రూ. 570 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 563 దిగువకు సైతం చేరింది.