హెచ్చుతగ్గులతో- మెటల్‌, ఐటీ వీక్

హెచ్చుతగ్గులతో- మెటల్‌, ఐటీ వీక్

వరుసగా నాలుగు రోజులపాటు లాభపడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 32 పాయింట్లు పుంజుకుని 38,631 వద్ద ట్రేడవుతోంది. అయితే నిఫ్టీ 7 పాయింట్లు తక్కువగా 11,457 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38703-38557 పాయింట్ల మధ్య ఊగిసలాడగా... నిఫ్టీ 11481-11440 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.  కాగా.. ఆమోదయోగ్యమైన బ్రెక్సిట్‌కు వీలుగా బ్రిటన్‌తో యూరోపియన్‌ యూనియన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై సందేహాలతో బుధవారం యూరోపియన్‌ మార్కెట్లు బలహీనపడగా.. సెప్టెంబర్లో రిటైల్‌ సేల్స్‌ క్షీణించడంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మిశ్రమ ధోరణి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.  

రియల్టీ డౌన్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ 0.4 శాతం స్థాయిలో బలపడగా.. మెటల్‌, రియల్టీ, ఐటీ 1-0.6 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, యస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, బ్రిటానియా, ఇండస్‌ఇండ్, ఐటీసీ, గెయిల్‌, ఎల్‌అండ్‌టీ 3-0.5 శాతం మధ్య ఎగశాయి. అయితే హిందాల్కో, వేదాంతా, సిప్లా, గ్రాసిమ్‌, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే 2-1 శాతం మధ్య క్షీణించాయి.

డెరివేటివ్స్‌ ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఫెడరల్‌ బ్యాంక్‌, మదర్‌సన్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, జస్ట్‌డయల్‌, సన్‌ టీవీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, ఏసీసీ 1.5-1 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోవైపు ఐడియా, నాల్కో, ఐబీ హౌసింగ్‌, అమరరాజా, డిష్‌ టీవీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, మైండ్‌ట్రీ, డీఎల్‌ఎఫ్‌ 4.6-2 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు ఫ్లాట్‌
మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లు అటూఇటుగా కదులుతున్నాయి. బీఎస్‌ఈలో ఇప్పటివరకూ 613 షేర్లు లాభపడగా.. 524 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో స్పెషాలిటీ, బజాజ్‌ కన్జూమర్, కేశోరామ్‌, అశోకా, లింకన్‌ ఫార్మా, బిర్లా కేబుల్‌, టీబీజెడ్‌, ఎస్‌టీసీ, డెన్‌, గ్లోబస్‌ స్పిరిట్స్‌, హాథవే తదితరాలు 13-4 శాతం మధ్య జంప్‌చేశాయి.