ప్చ్‌.. రిటైల్‌ సేల్స్‌- యూఎస్‌ వీక్‌

ప్చ్‌.. రిటైల్‌ సేల్స్‌- యూఎస్‌ వీక్‌

రిటైల్‌ అమ్మకాలు సెప్టెంబర్‌లో అనూహ్యంగా క్షీణించడంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలహీనపడ్డాయి. గత ఏడు నెలల్లో తొలిసారి రిటైల్‌ సేల్స్‌ 0.3 శాతం తిరోగమించాయి. దీంతో డోజోన్స్‌ 23 పాయింట్లు(0.1 శాతం) నీరసించి 27,002 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 6 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 2,990 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 25 పాయింట్లు(0.3 శాతం) వెనకడుగుతో 8,124 వద్ద స్థిరపడింది. ఇప్పటికే తయారీ రంగం మందగించడంతో తాజా గణాంకాలు ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తుతున్న ఆందోళనలను పెంచినట్లు నిపుణులు పేర్కొన్నారు.  

బీవోఏ ప్లస్‌లో
మూడో త్రైమాసికంలో పటిష్ట పనితీరు చూపడంతో బ్యాంకింగ్‌ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా షేరు 1.5 శాతం, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ఇక క్యూ3లో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించడంతో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ షేరు 2 శాతం ఎగసింది. కాగా.. యాపిల్‌, వాల్ట్‌డిస్నీ సైతం వీడియో స్ట్రీమింగ్‌ బిజినెస్‌లోకి ప్రవేశించడంతో నెట్‌ఫ్లిక్స్‌ షేరు గత మూడు నెలల్లో 20 శాతం పతనమైన విషయం విదితమే.

Image result for united airlines

డీల్‌ కుదిరేనా?
ఈ నెల 31లోగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగనున్న(బ్రెక్సిట్) నేపథ్యంలో డీల్‌పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. గురువారం నుంచి  బ్రస్సెల్స్‌లో ప్రారంభంకానున్న రెండు రోజుల సదస్సులో ఈయూ నేతలు సమావేశంకానున్నారు. ఆమోదయోగ్యమైన బ్రెక్సిట్‌కు వీలుగా డీల్‌ కుదుర్చుకునేందుకు ఇది చివరి అవకాశమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బ్రెక్సిట్‌కు మరోసారి గడువు పొడిగింపును కోరబోమంటూ బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తాజాగా స్పష్టం చేయడం గమనార్హం! 
 
అటూఇటుగా
బ్రెక్సిట్‌పై సందేహాల నేపథ్యంలో బుధవారం యూరోపియన్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూకే 0.6 శాతం బలహీనపడగా.. జర్మనీ 0.3 శాతం పుంజుకుంది. ఫ్రాన్స్‌ స్వల్ప నష్టంతో ముగిసింది. ప్రస్తుతం ఆసియాలోనూ మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. హాంకాంగ్‌, ఇండొనేసియా, థాయ్‌లాండ్‌, జపాన్‌ 0.8-0.2 శాతం మధ్య ఎగశాయి. మిగిలిన మార్కెట్లలో సింగపూర్‌,  తైవాన్‌, కొరియా 0.2 శాతం స్థాయిలో నీరసించాయి. కాగా.. కరెన్సీ మార్కెట్లలో డాలరు ఇండెక్స్‌ 98.03కు బలహీనపడగా.. జపనీస్‌ యెన్‌ 108.73కు బలపడింది. యూరో 1.107 వద్ద అటూఇటుగా కదులుతోంది.