నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?!

నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 11,490 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. రిటైల్‌ సేల్స్‌ నీరసించడం, బ్రెక్సిట్‌ డీల్‌పై సందేహాల నేపథ్యంలో బుధవారం యూరోపియన్‌, అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలహీనపడ్డాయి. కాగా.. వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ మార్కెట్లు నేడు ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

4వ రోజూ ఖుషీ 
వరుసగా నాలుగో రోజు బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 93 పాయింట్లు బలపడి 38,599 వద్ద నిలవగా... నిఫ్టీ సైతం 36 పాయింట్లు పుంజుకుని 11,464 వద్ద స్థిరపడింది. ఆమోదయోగ్యమైన బ్రెక్సిట్‌కు వీలుగా బ్రిటన్‌తో యూరోపియన్‌ యూనియన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్న వార్తలతో మంగళవారం మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లు ఊపందుకోగా.. బ్లూచిప్‌ కంపెనీల ఆకర్షణీయ ఫలితాలతో అమెరికన్‌ మార్కెట్లు పురోగమించాయి. ఆసియాలోనూ సానుకూల ధోరణి నెలకొనడంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌లో అమ్మకాలు పెరిగి నష్టాలలోకి ప్రవేశించినప్పటికీ చివరికి లాభాలతో నిలిచాయి.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,423 పాయింట్ల వద్ద, తదుపరి 11,382 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,493 పాయింట్ల వద్ద, తదుపరి 11,522 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 28,310, 28,081 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,764, 28,988 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 686 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1577 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ బాటలో మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 436 కోట్లు, డీఐఐలు రూ. 929 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.