పాలీకేబ్‌కు కిక్‌- ఈ షేర్లకు షాక్‌

పాలీకేబ్‌కు కిక్‌- ఈ షేర్లకు షాక్‌

ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక లాభాల దౌడు తీస్తున్న పాలీకేబ్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ కనిపిస్తొంది. దీంతో ఈ షేరు లిస్టింగ్‌ తదుపరి సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. ఇటీవల అమ్మకాలు వెల్లువెత్తుతున్న పలు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లకు మరోసారి అమ్మకాల సెగ తగులుతోంది. జాబితాలో డీహెచ్ఎఫ్‌ఎల్‌, ఆర్‌కేపిటల్‌, ఐబీ వెంచర్స్‌, కాఫీ డే, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తదితరాలున్నాయి. వెరసి ఈ కౌంటర్లు భారీ నష్టాలతో ఇన్వెస్టర్లకు షాక్‌ నిస్తున్నాయి. వివరాలు చూద్దాం..

Image result for polycab india ltd

పాలీకేబ్‌ ఇండియా లిమిటెడ్‌
ఇటీవల జోరుమీదున్న వైర్లు, కేబుళ్ల కంపెనీ పాలీకేబ్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2.2 శాతం పెరిగి రూ. 720 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 738 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్) ఫలితాలను కంపెనీ ఈ నెల 23న ప్రకటించనుంది. గత ఐదేళ్లలో ఎఫ్‌ఎంఈజీ విభాగంలోకి కంపెనీ ప్రవేశించడం, రుణభారాన్ని తగ్గించుకుంటూ రావడం వంటి అంశాల నేపథ్యంలో ఇకపై మరింత మెరుగైన పనితీరు చూపవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌పై పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. గత రెండు రోజుల్లో 10 శాతం లాభపడిన ఈ షేరు లిస్టింగ్‌ ధర రూ. 538తో పోలిస్తే 37 శాతం ర్యాలీ చేసింది.

పతన బాటలో
గత కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతున్న పలు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లలో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ కౌంటర్లు గత నెల రోజుల్లోనే 50 శాతం విలువను కోల్పోయాయి. జాబితాలో డీహెచ్ఎఫ్‌ఎల్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, ఆర్‌కేపిటల్‌, ఐబీ వెంచర్స్‌, కాఫీ డే తదితరాలున్నాయి. కాగా.. మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో గత రెండు రోజుల్లో 10 శాతం దిగజారిన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సైతం ప్రస్తుతం అమ్మకాలతో మళ్లీ డీలాపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐబీ హౌసింగ్‌ షేరు 7.4 శాతం పతనమై రూ. 175 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 171 వరకూ పడిపోయింది. వెరసి 2013 సెప్టెంబర్‌లో నమోదైన చరిత్రాత్మక కనిష్టం రూ. 166కు చేరువైంది.

నేలచూపులతో
ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 34.3 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఐబీ వెంచర్స్ 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 81.55 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి 52 వారాల కనిష్టానికి చేరింది. ఇక రిలయన్స్‌ కేపిటల్ రూ. 13.80 వద్ద సరికొత్త కనిష్టానికి చేరగా.. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు సైతం 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌కు చేరింది. రూ. 20.20  వద్ద ఫ్రీజయ్యింది.