రుపీ.. మూడో రోజూ నేలచూపే

రుపీ.. మూడో రోజూ నేలచూపే

గత రెండు రోజులుగా పతన బాటలో సాగుతున్న దేశీ కరెన్సీ మరోసారి నేలచూపులతో ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్ మార్కెట్లో 5 పైసలు తక్కువగా 71.59 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. ప్రస్తుతం మరికొంత బలహీనపడింది. 13 పైసలు క్షీణించి 71.67 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో మారకంలో మంగళవారం రూపాయి 31 పైసలు కోల్పోయి 71.54 వద్ద ముగిసింది. ఇది దాదాపు 4 వారాల కనిష్టంకాగా.. సోమవారం సైతం రూపాయి 21 పైసలు తిరోగమించింది. 71.23 వద్ద నిలిచింది. సక్రమ బ్రెక్సిట్‌కు వీలుగా బ్రిటన్‌తో యూరోపియన్‌ యూనియన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్న వార్తలతో బ్రిటిష్‌ పౌండ్‌, యూరో నెల రోజుల గరిష్టానికి చేరగా.. జపనీస్‌ యెన్‌ బలహీనపడింది. వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ  అమెరికా, చైనా మధ్య పాక్షిక ఒప్పందానికి అంగీకారం కుదిరిన  నేపథ్యంలో మూడు రోజులుగా స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. అయినప్పటికీ  దేశీ కరెన్సీ వెనకడుగు వేయడం గమనించదగ్గ అంశమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
గత మూడు నెలలుగా పెట్టుబడులను వెనక్కి  తీసుకుంటున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల(అక్టోబర్‌)లోనూ దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గత రెండు వారాలలో దేశీ కేపిటల్‌ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 6200 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈక్విటీ విభాగంలో రూ. 4955 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. రూ. 1262 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలనూ విక్రయించారు. వెరసి ఈ నెల 1-11 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 6200 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు.