లాభాల ఓపెనింగ్‌ నేడు?!

లాభాల ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 37 పాయింట్లు ఎగసి 11,472 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. వాణిజ్య వివాద పరిష్కారానికి పాక్షిక డీల్‌ కుదుర్చుకునేందుకు చైనా అంగీకరించడం, ఈ ఏడాది క్యూ3లో బ్యాంకుల పటిష్ట ఫలితాల నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్లు నేడు మరోసారి లాభాలతో ప్రారంభంకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఆటో, బ్యాంక్స్‌ దన్ను
వరుసగా రెండో రోజు మంగళవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ పటిష్టంగా కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ దాదాపు లాభాల ట్రిపుల్‌ సాధించింది. 292 పాయింట్లు జంప్‌చేసి 38,506 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 87 పాయింట్లు ఎగసి 11,428 వద్ద స్థిరపడింది. 15 నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు చెక్‌ పెట్టే బాటలో పాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు వారాంతాన అమెరికా, చైనా మధ్య అంగీకారం కుదిరింది. పాక్షిక ఒప్పందానికి చైనా సైతం అంగీకరించినట్లు వెలువడిన వార్తలు దేశీయంగా ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీంతో చివర్లో నిఫ్టీ సెంచరీ చేయగా.. సెన్సెక్స్‌ 38,635 వరకూ ఎగసింది.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,359 పాయింట్ల వద్ద, తదుపరి 11,291 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,480 పాయింట్ల వద్ద, తదుపరి 11,531 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 28,263, 27,970 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,771, 28,987 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 436 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 929 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. వారాంతాన రూ. 750 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన ఎఫ్‌పీఐలు సోమవారం మరోసారి రూ. 896 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఇక శుక్రవారం రూ. 703 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న డీఐఐలు సోమవారం తిరిగి రూ. 425 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.