కుప్పకూలిన బజాజ్‌ కన్జూమర్‌

కుప్పకూలిన బజాజ్‌ కన్జూమర్‌

ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో పనితీరు అంచనాలను చేరకపోవడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీ బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ లిమిటెడ్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు కంపెనీ కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లోనూ అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌
ఈ ఏడాది(2019-20) క్యూ2లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 56 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 3 శాతం బలపడి రూ. 214 కోట్లకు చేరింది. తల నూనె విభాగంలో అమ్మకాల పరిమాణం 6 శాతం పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. కాగా.. స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం 11 శాతం ఎగసి రూ. 57 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ కన్జూమర్‌ షేరు 15 శాతం కుప్పకూలింది. రూ. 195కు చేరింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. సోమవారం సైతం ఈ షేరు 4 శాతం క్షీణించి రూ. 230 వద్ద స్థిరపడింది.

Image result for indiabulls housing finance

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
 ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌తోపాటు.. విదేశీమారక సెక్యూరిటీల రేటింగ్‌ను Ba2 నుంచి B2కు డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ తెలియజేసింది. కంపెనీ నిధుల సమీకరణ, గవర్నెన్స్‌ సమస్యల నేపథ్యంలో రేటింగ్‌ను దిగువముఖంగా సవరించినట్లు మూడీస్‌ పేర్కొంది. కాగా.. మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని సంప్రదించనున్నట్లు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఐబీ హౌసింగ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 188కు చేరింది. తొలుత రూ. 182 వరకూ జారింది. గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 13 శాతం కుప్పకూలింది.