డీల్‌ కుదిరిందహో.. యూ.. యస్‌

డీల్‌ కుదిరిందహో.. యూ.. యస్‌

ఎట్టకేలకు 15 నెలలుగా కొనసాగుతున్నవాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ అగ్ర దేశాలు పాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ అంశాన్ని అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వారాంతాన స్వయంగా ప్రకటించారు. చైనీస్‌ వైస్‌ప్రీమియర్‌ లియూ హితో సమావేశమైన అత్యున్నత అధికారులు ప్రస్తుతానికి తొలి దశలో భాగంగా పాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. మేధో సంపత్తి(ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ), ఫైనాన్షియల్‌ సర్వీసులు, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందం కుదరినట్లు పేర్కొన్నారు. దశలవారీగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా వివాదాలను పరిష్కరించుకోనున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. బిలియన్లకొద్దీ దిగుమతులపై రెండు దేశాలూ టారిఫ్‌లను విధించుకోవడం ద్వారా వాణిజ్య వివాదాలు ముదురుతూ వచ్చాయి. కాగా.. ఒప్పందం కుదిరిన వార్తలతో వారాంతాన ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. వెరసి అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. 

Image result for Apple inc

మార్కెట్లు జూమ్‌
శుక్రవారం యూకే 1 శాతం, ఫ్రాన్స్‌, ఇటలీ 2 శాతం, జర్మనీ 3 శాతం చొప్పున ఎగశాయి. ఇక అమెరికన్‌ మార్కెట్లలో డోజోన్స్‌ 320 పాయింట్లు(1.2 శాతం) పుంజుకుని 26,817 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 32 పాయింట్లు(1.1 శాతం) ఎగసి 2,970 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 106 పాయింట్లు(1.35 శాతం) జంప్‌చేసి 8,057 వద్ద స్థిరపడింది. దీంతో మూడు వారాలుగా నష్టాలతో ముగుస్తున్న మార్కెట్లకు రిలీఫ్‌ లభించింది. వెరసి గత వారం నికరంగా డోజోన్స్‌, నాస్‌డాక్‌ 1 శాతం, ఎస్‌అండ్‌పీ 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి.

Image result for US Banking logos

యాపిల్‌ దూకుడు
అమెరికా, చైనా మధ్య మైత్రి కుదరడంతో ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ షేరు 3 శాతం ఎగసింది. ఇటీవల పలు రీసెర్చ్‌ కంపెనీలు షేరుకి బయ్‌ రేటింగ్‌ను ఇస్తున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా యాపిల్ షేరు ర్యాలీ బాటలో సాగుతున్న విషయం విదితమే. కాగా.. ఈ ప్రభావంతో చిప్‌ కంపెనీలు మైక్రాన్‌ టెక్నాలజీ, జైలింక్స్‌  4 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇతర కౌంటర్లలో క్యూ3 ఫలితాలు ప్రకటించనున్న బ్యాంకింగ్ దిగ్గజాలు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, జేపీ మోర్గాన్‌ 1.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇదే విధంగా ఫాంగ్‌ స్టాక్స్‌ ఫేస్‌బుక్‌, అమెజాన్, అల్ఫాబెట్‌ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. 
 
ప్లస్‌లో..
ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. తైవాన్‌, చైనా, హాంకాంగ్‌, కొరియా 1.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఇండొనేసియా, సింగపూర్‌,   0.5 శాతం స్థాయిలో ఎగశాయి. జపాన్‌, థాయ్‌లాండ్‌ మార్కెట్లకు సెలవు. కాగా.. కరెన్సీ మార్కెట్లలో డాలరు ఇండెక్స్‌ 98.43కు నీరసించగా.. జపనీస్‌ యెన్‌ 108.4కు చేరింది. యూరో 1.10 వద్ద స్థిరంగా కదులుతోంది. చైనీస్ యువాన్‌ 7.086ను తాకింది. బ్రెక్సిట్‌ డీల్‌పై అంచనాలతో  బ్రిటిష్‌ పౌండ్‌ 1.26కు ఎగసింది. 10ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 23 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడి 1.74 శాతానికి పుంజుకున్నాయి.