గ్లోబల్‌ పుష్‌- 38,000కు సెన్సెక్స్‌

గ్లోబల్‌ పుష్‌- 38,000కు సెన్సెక్స్‌

ప్రధానంగా అమెరికా, చైనా మధ్య మైత్రిపై అంచనాలు గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో పలుమార్లు ఆటుపోట్లను చవిచూసిన మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి. విజయదశమి పర్వదినం సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవుకాగా.. సోమ, గురువారాల్లో వెనకడుగులో నిలిచాయి. అయితే బుధ, శుక్రవారాల్లో జోరందుకోవడంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్‌ 38,000 పాయింట్ల కీలక మార్క్‌ ఎగువనే స్థిరపడింది. గత వారం(7-11) సెన్సెక్స్‌ 454 పాయింట్లు(1.2 శాతం) ఎగసి 38,127 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 127 పాయింట్లు(1.1 శాతం) పుంజుకుని 11,301 వద్ద నిలిచింది.

చిన్న షేర్లు.. ప్చ్‌
మార్కెట్లు జోరందుకున్నప్పటికీ చిన్న షేర్లు అంతంతమాత్ర లాభాలతో నిలిచాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 67 పాయింట్లు(0.5 శాతం) బలపడి 13,781 వద్ద స్థిరపడగా.. స్మాల్‌ క్యాప్‌ 37 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 12,772 వద్ద ముగిసింది.

బ్లూచిప్స్‌ తీరిలా
గత వారం దిగ్గజ కంపెనీలలో ఎయిర్‌టెల్‌ 13 శాతం జంప్‌చేయగా.. బ్రిటానియా, ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌యూఎల్‌ 8.5-3 శాతం మధ్య ఎగశాయి. అయితే యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఐటీసీ, ఐవోసీ, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌, ఇండస్‌ఇండ్‌ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి.

మిడ్‌ క్యాప్స్‌లో..
గత వారం మిడ్‌ క్యాప్స్‌లో అదానీ గ్రీన్‌, బంధన్‌ బ్యాంక్‌, వొడాఫోన్‌, గృహ ఫైనాన్స్‌, డెల్టా కార్ప్‌, బెర్జర్‌ పెయింట్స్‌, టాటా మెటాలిక్స్‌, రైట్స్‌, ఐబీ రియల్టీ, వెంకీస్‌ తదితరాలు 21-8.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క దివాన్‌, అరబిందో, ఆర్‌కేపిటల్‌, జైన్‌ ఇరిగేషన్‌, ఎడిల్‌వీజ్‌, ఐబీ ఇంటి, లక్ష్మీవిలాస్‌, వక్రంగీ, ఆర్‌ఇన్‌ఫ్రా, పిరమల్‌, ఐబీ హౌసింగ్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, ఐఆర్‌బీ, ఓబీసీ, పీఎన్‌బీ హౌసింగ్ తదితరాలు 32-12 శాతం మధ్య కుప్పకూలాయి.