మార్కెట్లకు ఇన్ఫీ.. ట్రంప్‌' కార్డ్‌

మార్కెట్లకు ఇన్ఫీ.. ట్రంప్‌' కార్డ్‌

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు ప్రధానంగా విదేశీ అంశాలు బూస్ట్‌నిచ్చే అవకాశముంది. అగ్ర దేశాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల పరిష్కారానికి తొలి దశలో భాగంగా పాక్షిక ఒప్పందం కుదరడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బలమొచ్చింది. రెండు రోజులపాటు నిర్వహించిన చర్చలలో భాగంగా వారాంతన రెండు దేశాలూ మేధోసంపత్తి, ఆర్థిక సేవలు, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై డీల్‌ కుదుర్చుకున్నాయి. దీంతో శుక్రవారం యూరోపియన్‌, అమెరికన్‌ స్టాక్ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. ఈ ప్రభావం తొలి దశలో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చే వీలుంది.

ఇన్ఫోసిస్‌ జోష్‌
శుక్రవారం మార్కెట్లు ముగిశాక సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఈ ప్రభావం మార్కెట్లపై సోమవారం(14న) కనిపించే వీలుంది. ఐటీ సేవల టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో నీరసించిన సెంటిమెంటుకు ఇన్ఫీ ఫలితాలు బూస్ట్‌నిచ్చే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) క్యూ2లో ఇన్ఫోసిస్‌ నికర లాభం త్రైమాసిక ప్రాతిపదికన 6 శాతం పెరిగింది. రూ. 4019 కోట్లను తాకింది. 

Image result for wholesale inflation

ఫలితాల క్యూ
ఇప్పటికే టీసీఎస్‌, ఇండస్‌ఇండ్, ఇన్ఫోసిస్‌ ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుట్టాయి. ఈ వారంలోనూ మరిన్ని దిగ్గజ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌) పనితీరును వెల్లడించనున్నాయి. 14న హెచ్‌యూఎల్‌, 15న ఏసీసీ, విప్రో, 18న అంబుజా సిమెంట్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ఫలితాలు వెలువడనున్నాయి.

ఐఐపీ వీక్‌
ఆగస్ట్‌ నెలలో పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) ప్రతికూల వృద్ధిని సాధించింది. మైనస్‌ 1.1 శాతంగా నమోదైంది. ఇది 81 నెలల కనిష్టంకాగా.. తయారీ, కేపిటల్‌ గూడ్స్‌ రంగాలు క్షీణించడం ప్రభావం చూపింది. ఇది ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగించే అంశంకాగా.. సెప్టెంబర్ నెలకు 14న టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు విడుదలకానున్నాయి. ఈ బాటలో 15న(మంగళవారం) వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటిపైనా ఇన్వెస్టర్లు కన్నేయనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
 
ఇతర అంశాలు
ఈ నెల 16న యూఎస్ రిటైల్‌ అమ్మకాలు, 18న చైనా క్యూ3 జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు వంటి పలు ఇతర అంశాలకూ ప్రాధాన్యమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు.