విదేశీ జోష్‌- మెటల్స్‌ ఖుషీ

విదేశీ జోష్‌- మెటల్స్‌ ఖుషీ

వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ చైనాతో పాక్షిక ఒప్పందం కుదిరే వీలున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్‌ వచ్చింది. దీంతో అమెరికా నుంచి ఆసియావరకూ మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్‌ 247 పాయింట్లు ఎగసి 38,127 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 71 పాయింట్లు పెరిగి 11,305 వద్ద నిలిచింది. విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత సెన్సెక్స్‌ లాభాల క్వాడ్రపుల్‌ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేసింది. వెరసి సెన్సెక్స్‌ 450 పాయింట్లు జంప్‌చేసి 38,345ను తాకగా.. నిఫ్టీ 125 పాయింట్లు ఎగసి 11,360కు చేరింది. అయితే జెడ్డావద్ద చమురు నౌకపై దాడులు జరిగిన వార్తలతో సెంటిమెంటుకు దెబ్బ తగిలింది. దీంతో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ నష్టాలలోకి సైతం ప్రవేశించింది. 37,738 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 11,189 వరకూ జారింది.

ఐటీ జోరు
అమెరికా, చైనా మధ్య ఒప్పందంపై అంచనాలతో మెటల్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2.3 శాతం పుంజుకోగా, ఐటీ 1.5 శాతం ఎగసింది. ఈ బాటలో ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ 1 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, ఇన్ఫోసిస్‌, వేదాంతా, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌, కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌ 4.7-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఐవోసీ, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌, ఎంఅండ్‌ఎం, ఆర్‌ఐఎల్‌, జీ, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌, గ్రాసిమ్‌, బీపీసీఎల్‌ 3.3-0.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

ఆర్‌బీఎల్‌ పతనం
డెరివేటివ్‌ కౌంటర్లలో  ఐబీ హౌసింగ్‌ 4 శాతం జంప్‌చేయగా.. టాటా మోటార్స్‌ డీవీఆర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, నిట్‌ టెక్‌, జిందాల్‌ స్టీల్‌ 4-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 8 శాతం, అరబిందో 6 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఎన్‌బీసీసీ, డిష్‌ టీవీ, ఇండిగో, ఆర్‌ఈసీ, ఐడియా, టొరంట్‌ ఫార్మా 3.3-2.4 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్ల బాటలో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 0.35 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1108 లాభపడగా.. 1358 నష్టాలతో నిలిచాయి.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 263 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 503 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 485 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 956 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.