ఐబీ రియల్టీ- దివాన్‌, ఆర్‌క్యాప్‌..!

ఐబీ రియల్టీ- దివాన్‌, ఆర్‌క్యాప్‌..!

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనకు బోర్డు నుంచి క్లియరెన్స్ లభించినట్లు వెల్లడించడంతో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. అమ్మేవాళ్లు కరువుకావడంతో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. కాగా.. మరోపక్క ఇటీవల పతన బాటలో సాగుతున్న ఎన్‌బీఎఫ్‌సీ.. దివాన్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్ కేపిటల్‌ కౌంటర్లలో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

ఇండియాబుల్స్‌ రియల్టీ
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజాగా ఇండియాబుల్స్‌ రియల్టీ లిమిటెడ్‌ పేర్కొంది. దీనిలో భాగంగా షేరుకి రూ. 100 ధర మించకుండా 5 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 11 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 500 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. బైబ్యాక్‌ ధర గురువారం ముగింపుతో పోలిస్తే 140 శాతం ప్రీమియంకావడం విశేషం! ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఐబీ రియల్టీ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసింది. రూ. 43.4 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. గత మూడు నెలల్లో ఈ షేరు 62 శాతం పతనంకావడం గమనార్హం!

దివాన్‌ హౌసింగ్‌..
లిక్విడిటీ, రుణ చెల్లింపులలో విఫలం తదితర సమస్యల కారణంగా ఏడాది కాలంలో 93 శాతం దిగజారిన దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కౌంటర్ మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ కౌంటర్లో అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరువుకావడంతో 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 2.4 క్షీణించి రూ. 21.15 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఎడిల్‌వీజ్‌, రిలయన్స్‌ ఎంఎఫ్‌ తదితర కంపెనీలు రుణాల వసూలుకి ముంబై హైకోర్టును ఆశ్రయించడం, ఈ ఏడాది క్యూ1 ఫలితాల విడుదలలో జాప్యంపై దివాన్‌ హౌసింగ్‌ ప్రమోటర్ల వాటాను సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ ఫ్రీజ్‌ చేయడం వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

రిలయన్స్‌ కేపిటల్‌
గత ఐదు రోజుల్లో 20 శాతం పతనమైన అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ కేపిటల్ లిమిటెడ్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 10.5 శాతం కుప్పకూలి రూ. 17.85 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 17.10 వద్ద ఆల్‌టైమ్‌ కనిష్టాన్ని చవిచూసింది. గత నెల రోజుల్లోనూ ఈ షేరు 51 శాతం దిగజారింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌లో వాటా విక్రయం తదుపరి ఈ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్న విషయం విదితమే.