ఆటుపోట్లలోనూ ఈ షేర్లు దూకుడు

ఆటుపోట్లలోనూ ఈ షేర్లు దూకుడు

వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ చైనాతో పాక్షిక ఒప్పందం కుదిరే వీలున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్‌ వచ్చింది. దీంతో అమెరికా నుంచి ఆసియావరకూ మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. వెరసి సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు వెనువెంటనే జోరందుకున్నాయి. సెన్సెక్స్ లాభాల క్వాడ్రపుల్‌ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేసింది. ఒక దశలో సెన్సెక్స్‌ 450 పాయింట్లు జంప్‌చేసి 38,345ను తాకగా.. నిఫ్టీ 125 పాయింట్లు ఎగసి 11,360కు చేరింది. అయితే జెడ్డావద్ద చమురు నౌకపై దాడులు జరిగిన వార్తలతో సెంటిమెంటుకు దెబ్బ తగిలింది. దీంతో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి సెన్సెక్స్‌ నష్టాలలోకి సైతం ప్రవేశించింది. 37,738 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం 66 పాయింట్ల లాభంతో 37947 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఈ  కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. జాబితాలో బంధన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, టాటా మెటాలిక్స్‌ లిమిటెడ్‌, గృహ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, స్మార్ట్‌లింక్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

బంధన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌: ప్రయివేట్‌ రంగానికి చెందిన ఈ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 555కు చేరింది. ఇంట్రాడేలో రూ. 608 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 70500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 8.71 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

టాటా మెటాలిక్స్‌ లిమిటెడ్‌: టాటా గ్రూప్‌నకు చెందిన మెటల్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8 శాతం ఎగసింది. రూ. 565కు చేరింది. రూ. 573 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 4100 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 9000 షేర్లు ట్రేడయ్యాయి.

గృహ ఫైనాన్స్‌ లిమిటెడ్‌: మార్టిగేజ్‌ రుణాలందించే ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసింది. రూ. 291కు చేరింది. ఇంట్రాడేలో రూ. 327 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 57000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 4.81 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌:  పునరుత్పాదక ఇంధన రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5 శాతం లాభపడింది. రూ. 77కు చేరింది. ఇంట్రాడేలో రూ. 79 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 3.81 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 6.4 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

స్మార్ట్‌లింక్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌: నెట్‌వర్క్‌ సర్వీసులకు సేవలందించే ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8 శాతం పురోగమించింది.రూ. 86కు చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 700 షేర్లు ట్రేడయ్యాయి.