సెన్సెక్స్‌ క్వాడ్రపుల్‌- ఐటీ డౌన్‌

సెన్సెక్స్‌ క్వాడ్రపుల్‌- ఐటీ డౌన్‌

వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ చైనాతో పాక్షిక ఒప్పందం కుదిరే వీలున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్‌ వచ్చింది. దీంతో అమెరికా నుంచి ఆసియావరకూ మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. వెరసి సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు వెనువెంటనే జోరందుకున్నాయి. సెన్సెక్స్ లాభాల క్వాడ్రపుల్‌ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 410 పాయింట్లు జంప్‌చేసి 38,291ను తాకగా.. నిఫ్టీ 121 పాయింట్లు ఎగసి 11,355 వద్ద ట్రేడవుతోంది. 

మెటల్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌ 3 శాతం, బ్యాంక్‌ నిఫ్టీ 2 శాతం ఎగశాయి. ఈ బాటలో ఆటో, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం చొప్పున బలపడగా.. ఐటీ 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, హిందాల్కో, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌, కొటక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే సిప్లా 4 శాతం, టీసీఎస్‌ 3 శాతం డీలాపడగా..  టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, ఐవోసీ, ఇన్ఫ్రాటెల్‌ 1-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

ఐబీ హౌసింగ్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో జిందాల్‌ స్టీల్‌ 4 శాతం, సెయిల్‌ 3 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఐబీ హౌసింగ్‌, ఐడియా 4.5 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో టొరంట్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌, యూబీఎల్‌, అరబిందో, ఇండిగో 3-1 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ఓకే
హుషారుగా కదులుతున్న మార్కెట్ల బాటలో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 0.75 శాతం చొప్పున పుంజుకున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ముత్తూట్‌, జయభారత్‌, టాటా లాంగ్‌, షాలిమార్, సొమానీ, జేబీఎం, టాటా మెటాలిక్స్‌, టిన్‌ప్లేట్‌, అబాన్‌, ఎవరెడీ, ఐబీ రియల్టీ, హెచ్‌బీఎల్‌, జీపీఐఎల్‌, శర్దాక్రాప్‌ తదితరాలు 8-5 శాతం మధ్య జంప్‌చేశాయి.