ఈ మిడ్‌ క్యాప్స్‌.. కుప్పకూలాయ్‌

ఈ మిడ్‌ క్యాప్స్‌.. కుప్పకూలాయ్‌

అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య నేటి నుంచి ప్రారంభంకానున్న చర్చలపై తలెత్తిన అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతోంది. ఏడాది కాలంగా కొనసాగుతున్న వాణిజ్య వివాద పరిష్కారానికి అత్యున్నత స్థాయిలో రెండు దేశాల ప్రతినిధులూ వారాంతం వరకూ చర్చలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇటీవల దేశీయంగా సెంటిమెంటు బలహీనపడటం కూడా దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 344 పాయింట్లు పతనమై 37,834ను తాకింది. వెరసి 38,000 పాయింట్ల దిగువకు చేరగా.. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 11,222 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. దీంతో  దీంతో ఈ  కౌంటర్లు భారీ నష్టాలతో డీలాపడ్డాయి. జాబితాలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, మ్యాగ్మా ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం.. 

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌: ప్రయివేట్‌ రంగ ఈ బ్యాంకింగ్ సంస్థ షేరు ఎన్‌ఎస్ఈలో 7 శాతం పతనమైంది. రూ. 289కు చేరింది. ఇంట్రాడేలో రూ. 283 వరకూ జారింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు(బీఎస్‌ఈ) పరిమాణం 10.58 లక్షల షేర్లు కాగా.. చివరి సెషన్‌కల్లా 9.71 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ఇండియాబుల్స్‌ హౌసింగ్ ఫైనాన్స్‌: ఈ నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 18 శాతం పడిపోయింది. రూ. 197కు చేరింది. ఇంట్రాడేలో రూ. 185.3 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 19.95 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 47.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

మ్యాగ్మా ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌: ఫైనాన్షియల్‌ సేవల రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 9 శాతం నష్టపోయింది. రూ. 46 దిగువకు చేరింది. తొలుత రూ. 45 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 9800 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 4200 షేర్లు ట్రేడయ్యాయి. 

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ఈ నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేరు అమ్మేవాళ్లు అధికంకావడంతో ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం దిగజారింది. రూ. 23.5 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల(బీఎస్‌ఈ) సగటు ట్రేడింగ్‌ పరిమాణం 23.72 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 10.3 లక్షల షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి.  

జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌: వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల రంగంలో కార్యకలాపాలు కలిగిన ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 12.5 శాతం కుప్పకూలింది. రూ. 14కు చేరింది. ఇంట్రాడేలో రూ. 13.2 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు(బీఎస్‌ఈ) ట్రేడింగ్‌ పరిమాణం 1.95 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 10.1 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.