ఇండస్‌ఇండ్‌ క్యూ2- షేరు డీలా

ఇండస్‌ఇండ్‌ క్యూ2- షేరు డీలా

ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఏడాది(2019-20) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఇండస్‌ఇండ్‌ రూ. 1383 కోట్ల నికర లాభం ఆర్జించింది.  త్రైమాసిక ప్రాతిపదికన ఇది 3.4 శాతం తక్కువకాగా.. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 2.3 శాతం శాతం పుంజుకుని రూ. 2909 కోట్లను అధిగమించింది. ఈ కాలంలో వార్షిక ప్రాతిపదికన రుణాల్లో 20.8 శాతం వృద్ధిని సాధించినట్లు బ్యాంక్‌ తెలియజేసింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4.1 శాతంగా నమోదయ్యాయి. ఇతర వివరాలు చూద్దాం..

ఎన్‌పీఏలు ఇలా
త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో ఇండస్‌ఇండ్‌ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.15 శాతం నుంచి 2.19 శాతానికి స్వల్పంగా పెరిగాయి. అయితే నికర ఎన్‌పీఏలు మాత్రం 1.23 శాతం నుంచి 1.12 శాతానికి ఉపశమించాయి. ప్రొవిజన్లు రూ. 431 కోట్ల నుంచి రూ. 737 కోట్లకు ఎగశాయి. స్లిప్పేజెస్‌ రూ. 725 కోట్ల నుంచి రూ. 1102 కోట్లకు పెరిగాయి. స్లిప్పేజెస్‌లో కార్పొరేట్‌ విభాగం నుంచి రూ. 175 కోట్ల నుంచి రూ. 479 కోట్లకు పెరిగితే.. కన్జూమర్ విభాగంలో రూ. 550 కోట్ల నుంచి రూ. 623 కోట్లకు చేరాయి.

షేరు పతనం..
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ షేరు 4.6 శాతం పతనమై రూ. 1248 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో తొలుత రూ. 1321 వద్ద గరిష్టానికి చేరిన ఈ షేరు ఫలితాల విడుదల తదుపరి రూ. 1232 దిగువకు సైతం పతనమైంది.