ఎయిర్‌టెల్‌, ఐడియాకు జియో జోష్‌

ఎయిర్‌టెల్‌, ఐడియాకు జియో జోష్‌

ఎట్టకేలకు వినియోగదారులపై ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీలను విధించేందుకు ముకేష్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ జియో చర్యలు చేపట్టడంతో మొబైల్‌ టెలికం రంగ దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కౌంటర్లకు జోష్‌వచ్చింది. వీటితోపాటు జియో మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ మూడు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కాగా.. మరోపక్క పీఎస్‌యూ దిగ్గజం పవర్‌గ్రిడ్‌ నుంచి తాజాగా ఆర్డర్‌ లభించినట్లు వెల్లడించడంతో ట్రాన్స్‌ఫార్మర్స్‌ అండ్ రెక్టిఫయర్స్‌ లిమిటెడ్‌(ట్రిల్‌) కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం..

Image result for airtel and vodafone

జోరుగా హుషారుగా
ఇతర నెట్‌వర్క్‌లకు కాల్‌ చేసే కస్టమర్ల నుంచి ఇకపై ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీ(ఐయూసీ)లను వసూలు చేయనున్నట్లు మొబైల్‌ దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా వెల్లడించింది. దీంతో ఇతర నెట్‌వర్క్‌లకు తమ కస్టమర్లు చేసే ఔట్‌గోయింగ్‌ కాల్స్‌పై విధించే చార్జీలను సంబంధిత ఆపరేటర్‌(మొబైల్‌ సేవల కంపెనీ)కు రిలయన్స్‌ జియో చెల్లించనుంది. వెరసి భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎయిర్‌టెల్‌ షేరు 4.4 శాతం జంప్‌చేసి రూ. 375 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 385 వద్ద 52 వారాల గరిష్టాన్ని చేరింది. ఈ బాటలో వొడాఫోన్‌ ఐడియా షేరు 6 శాతం పెరిగి రూ. 6.20 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 6.90 వరకూ ఎగసింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్‌ దాదాపు 3 శాతం ఎగసి రూ. 1360 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1366 వరకూ పెరిగింది.

Image result for transformers and rectifiers

ట్రిల్‌
విద్యుత్‌ రంగ పీఎస్‌యూ కంపెనీ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ నుంచి రూ. 126 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్లు తాజాగా ట్రాన్స్‌ఫార్మర్స్‌ అండ్‌ రెక్టిఫయర్స్‌ లిమిటెడ్ పేర్కొంది. దీనిలో భాగంగా  21 ట్రాన్స్‌ఫార్మర్లను సరఫరా చేయవలసి ఉంటుందని తెలియజేసింది. తాజా ఆర్డర్‌తో కలిపి ఆర్డర్‌బుక్‌ విలువ రూ. 1000 కోట్లను అధిగమించినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ట్రిల్‌ షేరు 17.5 శాతం దూసుకెళ్లి రూ. 8.10 వద్ద ట్రేడవుతోంది.