జియో కస్టమర్లకు రిలయన్స్ ఝలక్..! 

జియో కస్టమర్లకు రిలయన్స్ ఝలక్..! 

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తన కస్టమర్లకు షాక్‌ ఇచ్చింది. ఇకపై జియో కస్టమర్లు తాము చేసే ఇతర టెలికాం ఆపరేటర్ల కాల్స్ మీద నిమిషానికి 6 పైసలను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. దీనికి గానూ సమాన విలువ కలిగిన ఉచిత డేటాను తన కస్టమర్లకు పరిహారంగా ఇవ్వనున్నట్టు జియో తెలిపింది. 
ఇతర మొబైల్ ఆపరేటర్లకు అవుట్గోయింగ్ కాల్స్ కోసం, జియో యూజర్లు రేపటి నుండి అదనపు ఐయుసి(IUC) టాప్ అప్ వోచర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉచిత డేటా అర్హత పెరుగుదలతో అవుట్గోయింగ్ కాల్స్ కోసం పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. జియో యూజర్లు వాయిస్ కాల్స్ కోసం ఇలా  చెల్లించాల్సిరావడం ఇదే మొదటిసారి. అయితే ఈ టాప్ అప్ ఓచర్ల వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది. ఒక రూ.10 ల టాప్ అప్ ఓచర్‌ తో  నాన్ జియో మోబైల్స్ కు IUC 124 మినిట్స్ ఇస్తామని, దీనికి సమానంగా 1 జీబీ డేటాను జియో కస్టమర్లకు ఇస్తామని కంపెనీ పేర్కొంది. అలాగే రూ. 20 విలువ గల ఓచర్‌ తో 249 IUC మినిట్స్, 2 జీబీ డేటాను, 100 IUC రీచార్జ్ తో 1,362 నిమిషాలను (ఇతర, ప్రత్యర్ధి టెలికాం కంపెనీల మోబైల్స్ కు కాలే చేసే వ్యవథి) ను , 10 జీబీ డేటాను ఇస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. అయితే..ఈ చార్జీలు అంటే నిమిషానికి 6 పైసలు చొప్పున జియో నుంచి మరో జియోకి కాల్‌ చేస్తే వర్తించవని.. కంపెనీ తెలిపింది. 
సాధారణంగా ఒక మొబైల్ కంపెనీ ఫోన్ నుండి  మరో మొబైల్ కంపెనీ ఫోన్‌కు కాల్ వెళితే.. మొదటి మొబైల్ ఆపరేటర్, కాల్ వెళ్ళిన మొబైల్ కంపెనీకి IUC ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ దేశంలోనే అత్యధిక వినియోగదారులున్న రిలయన్స్ జియో ప్రతి యేటా ఇతర టెలికాం ఆపరేటర్లకు ఈ చార్జీలను చెల్లిస్తూ ఉంది. గత 3 సంవత్సరాల నుండి దాదాపు రూ. 13,500 కోట్ల IUC ఛార్జీలను ప్రత్యర్ధి ఆపరేటర్లైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా లకు చెల్లించింది. ఈ నష్టాలను తగ్గించుకోవడం కోసమే  ప్రత్యర్ధి మొబైల్ కంపెనీలకు చేసే అవుట్ గోయింగ్ కాల్స్ మీద 6 పైసల రుసుమును వసూలు చేయనున్నట్టు రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సర్ చార్జ్ విధానం అక్టోబర్ 11 నుండే అమలు కానుందని జియో తెలిపింది.