బ్యాంక్స్‌ పుష్‌- మార్కెట్లు గెలాప్‌

బ్యాంక్స్‌ పుష్‌- మార్కెట్లు గెలాప్‌

తడబడుతూ ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ దూకుడు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో ర్యాలీ చేశాయి. చివరికి సెన్సెక్స్‌ 646 పాయింట్లు దూసుకెళ్లి 38,178 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 187 పాయింట్లు జంప్‌చేసి 11,313 వద్ద నిలిచింది. చైనీస్‌ ప్రభుత్వ అధికారులు, కమ్యూనిస్ట్ నేతల వీసాలపై వాషింగ్టన్‌ ప్రభుత్వం నియంత్రణలు విధించనున్న వార్తలతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో తొలుత ఆటుపోట్ల మధ్య నీరసంగా ప్రారంభమైన మార్కెట్లు చివర్లో మరింత జోరందుకున్నాయి. యూరోపియన్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభంకావడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

మెటల్, రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ ఊపందుకోగా.. ఐటీ 0.8 శాతం నీరసించింది. బ్యాంక్‌ నిఫ్టీ 4 శాతం జంప్‌చేయగా.. మెటల్, రియల్టీ, ఆటో, ఫార్మా 2-1.2 శాతం మధ్య ఎగశాయి. బ్యాంక్‌ నిఫ్టీలో ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, బీవోబీ, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, యాక్సిస్‌ 5.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, సిప్లా 5.5-3.7 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌ 5 శాతం పతనంకాగా.. హీరో మోటో, జీ, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో, ఓఎన్‌జీసీ 3-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.  

పిరమల్‌ డౌన్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడియా, ఎన్‌సీసీ, డిష్‌ టీవీ, సెంచురీ టెక్స్‌, అశోక్‌ లేలాండ్, శ్రీరామ్‌ ట్రాన్స్‌, మణప్పురం 14-6 శాతం మధ్య దూసుకెళ్లాయి.  అయితే మరోవైపు పిరమల్‌ 7 శాతం దిగజారగా.. టాటా ఎలక్సీ, పిడిలైట్‌, హెక్సావేర్‌ 6.4-1.8 శాతం మధ్య బలహీనపడ్డాయి. కాగా.. రియల్టీ కౌంటర్లలో శోభా, ఇండియాబుల్స్‌, ఒబెరాయ్‌, బ్రిగేడ్‌, ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌, మహీంద్రా లైఫ్‌ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి.

మిడ్‌ క్యాప్స్‌ జోరు
మిడ్‌సెషన్‌ నుంచీ మార్కెట్లు జోరందుకోవడంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.4-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే ట్రేడైన షేర్లలో 1274 లాభపడితే.. 1244 నష్టాలతో నిలిచాయి.