ఈ మిడ్‌ క్యాప్‌ షేర్లు.. భలే జోరు

ఈ మిడ్‌ క్యాప్‌ షేర్లు.. భలే జోరు

చైనా ప్రభుత్వ అధికారుల, కమ్యూనిస్ట్‌ నేతల వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం నియంత్రణలు విధించనున్న వార్తలతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పతనంకాగా.. దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. తదుపరి నష్టాల నుంచి బయటపడి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేయగా.. నిఫ్టీ 85 పాయింట్లు ఎగసింది. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,860కు చేరింది. ప్రస్తుతం 37,808 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఈ  కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. జాబితాలో ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్ లిమిటెడ్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, ఎన్‌సీసీ లిమిటెడ్‌, డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌, వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్ లిమిటెడ్‌: ఆన్‌లైన్‌ బిజినెస్‌ సేవల రంగంలోని ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 13.4 శాతం దూసుకెళ్లింది. రూ. 2181కు చేరింది. ఇంట్రాడేలో రూ. 2218 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 11500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 22100 షేర్లు ట్రేడయ్యాయి.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌: పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ఈ అదానీ గ్రూప్‌ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8.3 శాతం ఎగసింది. రూ. 74.3కు చేరింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 3.3 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.11 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

ఎన్‌సీసీ లిమిటెడ్‌: మౌలిక సదుపాయాల రంగ ఈ హైదరాబాద్‌ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసింది. రూ. 50కు చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 21.46 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 12.08 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌: కాసినోవాలను నిర్వాహించే ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6 శాతం లాభపడింది. రూ. 166కు చేరింది. ఇంట్రాడేలో రూ. 168ను తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 1.66 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 90,300 షేర్లు ట్రేడయ్యాయి. 

వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌: మొబైల్‌ సేవల ఈ దిగ్గజ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసింది. రూ. 5.5కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం(బీఎస్‌ఈ) 177.6 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా కోటి షేర్లు చేతులు మారాయి.