రేమండ్‌ జోరు- టైటన్‌ డీలా

రేమండ్‌ జోరు- టైటన్‌ డీలా

మహారాష్ట్రలోని థానేలోగల భూమిని విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో బ్రాండెడ్‌ దుస్తులు, ఫ్యాషన్‌ రిటైలింగ్‌ కంపెనీ రేమండ్‌ లిమిటెడ్ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నమోదైన వివిధ బిజినెస్‌ వివరాలు వెల్లడించిన నేపథ్యంలో టాటా గ్రూప్‌ దిగ్గజం టైటన్‌ కంపెనీ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి రేమండ్‌ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. టైటన్‌ కంపెనీ షేరు నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

రేమండ్‌ లిమిటెడ్‌
థానే వెస్ట్‌లోని పంచ్‌పఖాడీ గ్రామంలోగల సుమారు 78,310 చదరపు మీటర్ల భూమిని విక్రయించేందుకు ఎల్పిస్‌ వెంచర్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రేమండ్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. సహచర సంస్థ జేకే ఇన్వెస్టో ట్రేడ్‌ ద్వారా కుదుర్చుకున్న ఈ ఒప్పందం విలువను రూ. 700 కోట్లుగా తెలియజేసింది. కంపెనీలో ప్రమోటర్లకు 43.99% వాటా ఉంది. ఈ వార్తల నేపథ్యంలో రేమండ్‌ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 8.5 శాతం జంప్‌చేసి రూ. 593 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 595ను సైతం అధిగమించింది. 

Image result for titan company

టైటన్‌ కంపెనీ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో జ్యువెలరీ విభాగం అమ్మకాలు భారీగా నీరసించినట్లు టైటన్‌ కంపెనీ తాజాగా వెల్లడించింది. జూన్‌ నుంచీ పసిడి ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గినట్లు తెలియజేసింది. వాచీల విభాగం 7 శాతం వృద్ధిని చూపగా.. ఐ వేర్‌ డివిజన్‌ 28 శాతం ఎగసినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టైటన్‌ కంపెనీ షేరు 3.5 శాతం పతనమై రూ. 1215 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1177 వరకూ జారింది.