జేబీఎం- జేకుమార్.. జూమ్‌

జేబీఎం- జేకుమార్.. జూమ్‌

తాజాగా ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో ఆటో విడిభాగాల కంపెనీ జేబీఎం ఆటో లిమిటెడ్‌ కౌంటర్ జోరందుకుంది. కాగా.. మరోవైపు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ క్లియరెన్స్‌ ఇచ్చినట్లు వెలువడిన వార్తలతో మౌలిక సదుపాయాల కంపెనీ జే కుమార్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

జేబీఎం ఆటో లిమిటెడ్‌
సుమారు 300 బస్సుల సరఫరాకు ఆర్డర్ లభించినట్లు జేబీఎం ఆటో లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) ముగిసేలోగా వీటి సరఫరాను పూర్తి చేయనున్నట్లు తెలియజేసింది. ఢిల్లీ మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌, స్పైస్‌జెట్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌లతోపాటు.. నవీ ముంబై మునిసిపాలిటీ నుంచి లభించిన ఈ ఆర్డర్లలో భాగంగా సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ బస్సులను సైతం సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది.ఈ నేపథ్యంలో జేబీఎం ఆటో కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 13 శాతం దూసుకెళ్లి రూ. 212 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 215 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్లకు 61.96% వాటా ఉంది.

Image result for j kumar infraprojects ltd

జే కుమార్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌
ఖాతా పుస్తకాలలో అక్రమాల అంశానికి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ క్లియరెన్స్‌ ఇచ్చినట్లు వెలువడిన వార్తలు జే కుమార్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 12 శాతం జంప్‌చేసి రూ. 143 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 154 వరకూ ఎగసింది.