ఐబీ రియల్టీ భళా- దివాన్‌ కుదేల్‌

ఐబీ రియల్టీ భళా- దివాన్‌ కుదేల్‌

ఇటీవల నేలచూపులతో కదులుతున్న ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగింది. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదన దీనికి కారణం కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌ ఫలితాల ఆలస్యం నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీ.. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఐబీ రియల్టీ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా.. దివాన్‌ హౌసింగ్‌ కౌంటర్ 10 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం...

ఇండియాబుల్స్‌ రియల్టీ
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదన చేయడంతో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్‌ 5 శాతం జంప్‌ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు రూ. 2 ఎగసి రూ. 43 వద్ద ఫ్రీజయ్యింది. ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను ఈ నెల 11న సమావేశంకానున్న కంపెనీ బోర్డు పరిశీలించనున్నట్లు ఐబీ రియల్టీ తాజాగా తెలియజేసింది.

Image result for dewan housing finance corporation ltd

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్) ఫలితాల విడుదల ఆలస్యం అయిన కారణంగా దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో ప్రమోటర్ల వాటాను సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(సీడీఎస్‌ఎల్‌) ఫ్రీజ్‌ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. ఈ నెల 17న క్యూ1 ఫలితాలు విడుదల చేసేందుకు దివాన్‌ హౌసింగ్‌ బోర్డు సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. ఫలితాల విడుదలలో జాప్యానికి అంతక్రితం ఆడిటర్లుగా వ్యవహరించిన కంపెనీ రాజీనామా చేయడమే కారణమని దివాన్‌ హౌసింగ్‌ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు 10 శాతం పతనమై రూ. 26 వద్ద ఫ్రీజయ్యింది.