ఆటుపోట్లతో.. ఫార్మా, ఐటీ వీక్‌

ఆటుపోట్లతో.. ఫార్మా, ఐటీ వీక్‌

స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 11 పాయింట్లు తక్కువగా 37,521కు చేరగా.. నిఫ్టీ సైతం 3 పాయింట్లు బలహీనపడి 11,123 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,663 వద్ద, నిఫ్టీ 11159 వద్ద గరిష్టాలను తాకాయి. విజయదశమి పర్వదినం సందర్భంగా మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. అమెరికా మార్కెట్లు అమ్మకాలతో పతనమయ్యాయి. ఆసియాలోనూ ప్రస్తుతం బలహీన ధోరణి కనిపిస్తోంది. గత వారాంతాన ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో సోమవారం వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలాపడిన సంగతి తెలిసిందే. 

ప్రభుత్వ బ్యాంక్స్‌ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ, రియల్టీ 1.2-0.6 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, కొటక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, ఏషియన్ పెయింట్స్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, నెస్లే, విప్రో 2.5-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌ 8 శాతం పతనంకాగా.. టైటన్‌ 5 శాతం పడింది. ఈ బాటలో జీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, హీరో మోటో, యాక్సిస్‌, యూపీఎల్‌ 3-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, ఎన్‌సీసీ, మణప్పురం, ఐజీఎల్‌, సెంచురీ టెక్స్‌, సీమెన్స్‌, క్యాస్ట్రాల్‌, కమిన్స్‌ ఇండియా 3-1.3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క పిరమల్‌ 8.5 శాతం కుప్పకూలగా.. స్టార్‌, ఆర్‌బీఎల్‌, బ్యాంక్‌, జూబిలెంట్ ఫుడ్‌, డీఎల్‌ఎఫ్‌, టాటా ఎలక్సీ 6.5-2.3 శాతం మధ్య పతనమయ్యాయి.   

చిన్న షేర్లు వీక్
మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 0.1 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 672 లాభపడగా.. 777 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఏఆర్‌వీ స్మార్ట్‌, దివాన్‌, జీ మీడియా, కెల్టన్‌ టెక్‌, ఆప్టిమస్, ఐబీ ఇంటిగ్రే, లక్ష్మీ విలాస్‌, ఫ్యూచర్‌ కన్జూమర్‌, ఎస్‌టీసీ, రిలయన్స్‌ కేపిటల్, సోరిల్‌ ఇన్‌ఫ్రా, ముకంద్‌, సలసర్‌ తదితరాలు 8-5 శాతం మధ్య పతనమయ్యాయి.