వీసా షాక్‌- యూఎస్‌ పతనం

వీసా షాక్‌- యూఎస్‌ పతనం

చైనాకు చెందిన ప్రభుత్వ అధికారులు, కమ్యూనిస్ట్‌ నేతల వీసాలపై వాషింగ్టన్‌ ప్రభుత్వం నియంత్రణలు విధించనున్నట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు తిరిగి పెరగవచ్చన్న అంచనాలు దీనికి కారణంకాగా.. మంగళవారం స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా డోజోన్స్‌ 314 పాయింట్లు(1.2 శాతం) కోల్పోయి 26,164 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 46 పాయింట్లు(1.6 శాతం) పతనమై 2,893 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 132 పాయింట్లు(1.7 శాతం) దిగజారి 7,824 వద్ద స్థిరపడింది. చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రొవిన్స్‌లో ముస్లిం మైనారిటీల నిర్భంధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ప్రభుత్వం వీసాల నియంత్రణకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Image result for US Banks logos

ఫెడ్‌పై ఆశలు
ఈ నెలలో అమెరికా, చైనా మధ్య చేపట్టనున్న వాణిజ్య వివాద చర్చలపై వీసా నియంత్రణ ఆదేశాలు ప్రతికూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ నెలాఖరున ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్వహించనున్న పాలసీ సమీక్షలో కనీసం పావు శాతం వడ్డీ రేటును తగ్గించే వీలున్నట్లు ఆర్ధికవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మార్కెట్లు లాభాల నుంచి నష్టాలలోకి మళ్లాయి.

బ్లూచిప్స్‌ డీలా
మంగళవారం ట్రేడింగ్‌లో బ్యాంకింగ్‌ బ్లూచిప్స్‌.. సిటీగ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్‌ 1 శాతం చొప్పున బలహీనపడగా.. టెక్‌ దిగ్గజాలు ఫేస్‌బుక్‌, అమెజాన్, అల్ఫాబెట్‌ సైతం ఇదే స్థాయిలో వెనకడుగు వేశాయి. ఈ బాటలో చిప్‌ కంపెనీలు ఎన్‌విడియా, క్వాల్‌కామ్‌ తదితరాలు నీరసించాయి. కాగా.. చైనీస్‌ కంపెనీలు అలీబాబా, జేడీ.కామ్‌ 3.5 శాతం చొప్పున పతనమయ్యాయి.

నేలచూపుతో
మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ 0.8-1.2 శాతం మధ్య క్షీణించాయి. ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ధోరణి కనిపిస్తోంది. తైవాన్‌,  జపాన్‌, హాంకాంగ్‌, సింగపూర్‌ 0.7-0.4 శాతం మధ్య నీరసించగా.. చైనా, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా నామమాత్ర నష్టాలతో కదులుతున్నాయి. కొరియా మార్కెట్‌కు సెలవు.